కేసీఆర్ మైండ్ సెట్ మార్చుకోవడం వెనుక సీక్రెట్: విజయశాంతి ఆసక్తికరం

By narsimha lodeFirst Published Jun 19, 2019, 9:33 AM IST
Highlights

సచివాలయం విషయంలో  కేసీఆర్ మైండ్ సెట్ మారడం వెనుక రహస్యం ఉందని టీఆర్ఎస్ నేతలు తనకు చెప్పారని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి చెప్పారు. 

హైదరాబాద్:  సచివాలయం విషయంలో  కేసీఆర్ మైండ్ సెట్ మారడం వెనుక రహస్యం ఉందని టీఆర్ఎస్ నేతలు తనకు చెప్పారని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి చెప్పారు. ఈ విషయం విని తాను ఆశ్చర్యపోయినట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

నిన్నటివరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్‌పోలో గ్రౌండ్‌కు తరలిస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారని ఆమె గుర్తు చేశారు.  తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బైసన్ పోల్‌ గ్రౌండ్స్‌‌ కోసం కేసీఆర్ పైరవీలు చేశాడని  ఆమె గుర్తు చేశారు.

కేసీఆర్ రెండో సారి సీఎంగా  ఎన్నికైన తర్వాత  బైసన్ పోలో గ్రౌండ్స్‌ను ఇచ్చేందకు కేంద్రం ఒప్పుకొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బైసన్ పోల్ గ్రౌండ్స్‌లో సచలివాయలం నిర్మిస్తామని  చెప్పిన కేసీఆర్  ఆ తర్వాత వెంటనే తన మనసు మార్చుకొన్నారన్నారు.బైసన్ పోలో గ్రౌండ్ వద్దు  పాత సచివాలయ ప్రాంగణం ముద్దు అంటూ  కొత్త పల్లవి అందుకొన్నారని  ఆమె విమర్శించారు.

కేసీఆర్‌ మైండ్ సెట్ అకస్మాత్తుగా మారడం వెనుక అసలు రహస్యం ఒకటి ఉందని ఇటీవల కలిసిన టీఆర్ఎస్ నేతలు కొందరు నాతో చెప్పిన మాటలు విని ఆశ్చర్యం కలిగిందని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.  

 బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు.
కొత్త సచివాలయంలోకి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు తనకు చెప్పారని విజయశాంతి గుర్తు చేసుకొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్‌కు షాకిచ్చాయని విజయశాంతి అభిప్రాయపడ్డారు.  

బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి అని కేసీఆర్‌లో ఆందోళన మొదలైనట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దాంతో పాత సచివాలయ ప్రాంగణంలోనే పునర్నిర్మాణం చేసి, డిజైన్ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఉందని విజయశాంతి ఆ పోస్టులో కేసీఆర్‌పై సెటైర్లు వేశారు.

సచివాలయాన్ని మార్చడమో గానీ. కేసీఆర్ మైండ్ సెట్ మారకపోతే సీఎం  పదవి నుండి ఆయనను మార్చేందుకు తెలంగాణ ప్రజలు వెనకాడరని... ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం గుర్తుంచుకోవాలని  ఆ పోస్టింగ్‌లో విజయశాంతి పేర్కొన్నారు.

click me!