గ్లోబరీనాపై చర్యలు ఏవి... కేసీఆర్ పై విజయశాంతి కామెంట్స్

By telugu team  |  First Published Sep 21, 2019, 8:02 AM IST

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతం జరిగి చాలా నెలలు గడిచిన తర్వాత...ఇప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీ చేయడం చూస్తుంటే .. విద్యార్థుల పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆమె చెప్పారు.


ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను బదిలీ చేస్తూ... టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటి తుడుపు చర్యగానే భావించాల్సి ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి పేర్కొన్నారు. అశోక్ కుమార్ పై చర్యలు తీసుకున్నారు గానీ... గ్లోబరీనా పై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఇంటర్ పరీక్షల నిర్వహణలో.. ఏ మాత్రం అవగాహన, అనుభవం లేని గ్లోబరీనా అనే సంస్థకు టెండర్లు కట్టబెట్టి.. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కేసీఆర్ సర్కార్... అశోక్ కుమార్‌పై బదిలీ వేటు వేసి... చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. 

Latest Videos

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతం జరిగి చాలా నెలలు గడిచిన తర్వాత...ఇప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీ చేయడం చూస్తుంటే .. విద్యార్థుల పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆమె చెప్పారు.
 
రాష్ట్రపతి నివేదిక అడిగి నెల రోజులు గడిచిన తర్వాత... కొత్త గవర్నర్‌కు దీనిపై వివరణ ఇవ్వాలన్న భయంతోటే కేసీఆర్ సర్కారు ఈ చర్య తీసుకుందన్న అనుమానం కలుగుతోందని విజయశాంతి చెప్పారు. కెసిఆర్ ఇంట్లో కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఇంటర్ విద్యార్థులకు లేదని ఆమె చెప్పారు. తనతోపాటు కొందరు ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలపై సమాధానం చెప్పలేక... చివరకు మొక్కుబడిగా అశోక్ కుమార్‌ను బదిలీ చేసి... తప్పించుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని రాములమ్మ ఆరోపించారు. తాజా పరిణామాలను చూస్తూ ఉంటే.. ముందుంది ముసళ్ళ పండగ అనే విషయం అర్థం అవుతోందన్నారు.

click me!