ఇప్పుడేం చేస్తారు: పార్టీ తీరుపై భగ్గుమన్న విహెచ్, భేటీ నుంచి ధర్నాకు...

By telugu teamFirst Published May 11, 2019, 12:00 PM IST
Highlights

పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత విహెచ్ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళ్లిపోయారు. ఇతర పార్టీలవాళ్లను పార్టీలోకి తీసుకుని మన పార్టీవాళ్లను బయటకు పంపడమేమిటని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సందేశమిస్తారని ఆయన ప్రశ్నించారు. 

హైదరాబాద్: పార్టీ పనితీరుపై తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు భగ్గుమన్నారు. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులకు ఖరారు చేయడానికి శనివారం గాంధీభవన్ లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, విహెచ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో విహెచ్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత విహెచ్ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళ్లిపోయారు. ఇతర పార్టీలవాళ్లను పార్టీలోకి తీసుకుని మన పార్టీవాళ్లను బయటకు పంపడమేమిటని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సందేశమిస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినప్పుడే 11 మంది శాసనసభ్యులను పిలిచి మాట్లాడాల్సిందని, ఇప్పుడు మాట్లాడి ఏం చేస్తారని ఆయన అడిగారు. 

నాంపల్లిలో పనిచేసిన ఫిరోజ్ ను హైదరాబాద్ లో పోటీకి ఎందుకు పెట్టారని, అక్కడ అభ్యర్థులే లేరా అని విహెచ్ ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కోరుట్లల్లో వెలమలకు ఎందుకు సీట్లు ఇచ్చారని అడిగారు. 

కెఎస్ రత్నంను పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని అడిగారు. ఆర్. కృష్ణయ్యకు, కాసాని జ్ఞానేశ్వర్ కు ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చారని విహెచ్ నిలదీశారు. దేశంలో బీసీ సాధికారిక కమిటీ ఎక్కడా లేదని, ఇక్కడే ఎందుకుందని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఒక్కడే తిరిగి ఏం చేస్తాడని, తాము లేమా అని విహెచ్ ప్రశ్నించారు 

రంగారెడ్డి ఎమ్మెల్సీ సీటుకు మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు వరంగల్ నుంచి కొండా మురళిని పోటీకి దించే ప్రయత్నంలో ఉన్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తుండగా, నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి పేరును పరిశీలిస్తోంది. 

click me!