
విజయవాడ: తెలంగాణ మంత్రి కేటీ రామారావుకు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు బూతు సాహితీ అవార్డులివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. నారా లోకేష్ కన్నా పవన్‌కల్యాణ్‌కు ఎక్కువ అనుభవం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగా కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారంలోకి వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వీహెచ్ చెప్పారు.
ఎన్నికలు వస్తుండడంతో కేసిఆర్ కు బీసీలు గుర్తుకు వస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అడ్డు పడిన కేసిఆర్ కు తెలంగాణలోని ఆంధ్రులు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ బిజెపితో అంట కాగుతోందని అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తమ వద్ద చివరి బంతి ఉందని గతంలో కొంత మంది తమ పార్టీ నాయకులు చేసిన ప్రకటనల వల్ల తెలంగాణలో కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన అన్నారు.