తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న కుంభవృష్టితో రోడ్లన్ని చెరువుల్లా మారాయి.
కరీంనగర్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరదనీటితో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే వరద తీవ్రత ఎక్కువగా వుంది. రోడ్లపై వరదనీరు చేరి ప్రమాదకరంగా ప్రవహించడంతో పాటు కొన్నిచోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు చుట్టుముట్టడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. సహాయక సిబ్బంది చేరుకోడానికి కూడా వీలులేకుండా కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
పెద్దపల్లి పట్టణం నుండి జూలపల్లి, ఎలిగేడు, ఓదెల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపైనుండి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేన్ మియా వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వడకాపూర్, కొత్తపల్లి, జాఫర్గాన్ పేట్, ఇదులాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలకు వెళ్లేదారిలో వంతెనల పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు బాగా దూరమైన వేరే మార్గాల్లో ప్రయాణిస్తున్నారు.
undefined
వీడియో
జగిత్యాల-ధర్మపురి మధ్య రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపైకి ఉప్పొంగుతున్న అనంతారం వాగు నీరు చేరింది. దీంతో వాగువద్ద పోలీసులు భద్రత ఏర్పాటుచేసి రాకపోకలను నిలిపివేసారు. ధర్మపురి మండలం నేరెల్ల పశువుల పాపన్నగుట్ట వద్ద కూడా జాతీయ రహదారిపైకి వాగునీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాయికల్ మండలంలోని మైతాపూర్ వద్దగల వంతెనపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు పూర్తి నిలిచిపోయాయి.
ఇక సిరిసిల్ల పట్టణంలో రికార్డ్ వర్షపాతం నమోదయ్యింది. కేవలం ఏడు గంటల్లోనే 140 మి.మీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇల్లంతకుంటలో 106.3, తంగళ్ళపల్లిలో 87.8, ముస్తాబాద్ లో 75, గంభీరావుపేటలో 61, ఎల్లారెడ్డిపేటలో 93.3, వీర్నపల్లిలో 55 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, ఇళ్లలోకి నీరుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.