శభాష్ రేవంత్ ... నువ్వు గొప్పపని చేసావు : కాంగ్రెస్ సీఎంకు వెంకయ్యనాయుడు ప్రశంసలు 

Published : Jul 18, 2024, 08:48 AM IST
శభాష్ రేవంత్ ... నువ్వు గొప్పపని చేసావు : కాంగ్రెస్ సీఎంకు వెంకయ్యనాయుడు ప్రశంసలు 

సారాంశం

ప్రత్యర్థి పార్టీ, ప్రభుత్వం ఏం చేసినా అందులోని తప్పులనే వెతుకుతుంటారు రాజకీయ నాయకులు. కానీ బిజెపి నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిపనిని గుర్తించడమే కాదు సీఎంను ప్రశంసించారు. ఇంతకూ వెంకయ్య మెచ్చిన ఆ సీఎం ఎవరంటే... 

Venkaiah Naidu : తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ వ్యవసాయ రుణాల మాపీ చేపట్టింది. ఈ రుణమాపీకి సంబంధించిన విధివిధానాలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ విధివిధానాల ఉత్తర్వులే వెంకయ్యనాయుడు ప్రశంసలకు కారణం.  

రైతు రుణాల మాపీ విధివిధానాలు కాదు... ఈ ఉత్తర్వులు తెలుగులో వుండటం వెంకయ్య నాయుడును ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో పార్టీలు వేరయిన, రాష్ట్రం వేరయినా...మాతృభాషను గౌరవించిన కాంగ్రెస్ సర్కార్ ను అభినందించకుండా వుండలేకపోయారు. రైతులకు అర్థమయ్యేలా తెలుగులో విధివిధానాల విడుదల చాలా మంచి నిర్ణయం అనేది వెంకయ్యనాయుడు అభినందనల వెనక అసలు ఉద్దేశం. 

వెంకయ్య నాయుడు ఏమన్నారంటే : 

''ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై  తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం'' అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

''ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా, అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ  తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు గారికి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేసారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?