తెలంగాణ కాంగ్రెస్ బిజెపి ఓటుబ్యాంకుపై కన్నేసింది. లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచినవారిని ఎలాగైనా కాంగ్రెస్ వైపు తిప్పాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. ఆ దిశగా కీలక ముందడుగు వేసారు....
Revanth Reddy : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. వీలైనంత తొందరగా వీటిని కూడా నిర్వహించే ప్లాన్ లో వుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇవాళ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు.
పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది రిజర్వేషన్లే. కాబట్టి పంచాయితీ ఎన్నికల్లో అనుసరించాల్సిన రిజర్వేషన్ ప్రక్రియలో మార్పులు చేయాలని... బిసిలకు అధికంగా అవకాశం వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల పెంపు అధికారులతో చర్చించారు సీఎం.
undefined
ఈ సందర్భంగా బిసి రిజర్వేషన్ల పెంపుపై మంత్రులతో కూడా చర్చించారు ముఖ్యమంత్రి. వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలని అధికారులకు సూచించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా అభిప్రాయాలను వెల్లడించారు.
గత పంచాయితీ ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ విధానాన్ని సీఎంకు వివరించారు అధికారులు. అలాగే వివిధ రాష్ట్రాలు చేపట్టిన కుల గణన విధానాన్ని కూడా వివరించారు. అయితే కులగణన చేపట్టాక ఎన్నికలకు వెళితే ఎలా వుంటుందని అధికారులను అడగ్గా... ఎంత వేగంగా చేపట్టిన ఇందుకు ఐదారు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వీలైనంత తొందరగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
పంచాయితీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల పెంపుపై అధికారులు,మంత్రులతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలలోపు మరోసారి దీనిపై చర్చించిద్దామని ... అప్పటివరకు ఈ సమవేశంలో సూచించిన అంశాలతో నివేదిక సిద్దం చేయాలని సూచించారు. ఇలా పంచాయితీతో పాటు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది.