వనితారెడ్డి మాయం.. శశిధర్ పరార్

First Published Dec 15, 2017, 12:12 PM IST
Highlights
  • విజయ్ సాయి కేసు మిస్టరీ
  • ఆచూకీ లేని వనితారెడ్డి
  • పరారైన శశిధర్

సినీ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య వ్యవహారం మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా.. ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. కీలక నిందితులెవరు? ఎవరి వత్తిళ్లు భరించలేక విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంలో పోలీసు విచారణలో ఎలాంటి ముందడుగు పడలేదు. రెండు రోజుల క్రితం ఈ కేసులో విజయ్ సాయి భార్య వనితారెడ్డితోపాటు అడ్వకెట్ ను, నవయుగ డైరెక్టర్ శశిధర్ ను అరెస్టు చేస్తారంటూ పోలీసు వర్గాల నుంచి లీకులు వచ్చాయి. కానీ పరిణామాలు చూస్తే అటువంటిదేమీ కనిపించడంలేదు.

ఇక విజయ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత క్షణాల్లో మీడియా ముందుకు వచ్చిన ఆయన భార్య వనితారెడ్డి ఇప్పుడు మాయమైపోయింది. ఆమె జాడ దొరకడంలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆమె ఆచూకీ లేకపోవడంతో ఈ కేసులో పురోగతి లేదని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె సేఫ్ ప్లేస్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇక విజయ్ సాయి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ శశిధర్ ఆచూకీ కూడా దొరకడంలేదు. శశిధర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్ సాయి తన సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణమైన వారెవరినీ వదలొద్దంటూ తండ్రిని వేడుకున్నారని తండ్రి చెప్పిన మాట. ఆ వ్యక్తుల్లో విజయ్ భార్య వనితారెడ్డి, అడ్వకెట్ తోపాటు నవయుగ కంపెనీ ఎండి శశిధర్ పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మరి ఈ కేసులో వనితారెడ్డి, శశిధర్ ఇద్దరూ అందుబాటులో లేకుండాపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి.

సెల్ఫీ వీడియో ఏమైనట్లు  ?

విజయ్ సాయి సెల్ఫీ వీడియో తీసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి చెబుతున్నాడు. ఆ సెల్పీ వీడియోలోని 3 సెకన్ల వీడియో మాత్రమే పోలీసులు బయటకు లీక్ చేశారు. ఆ వీడియో సుమారు 15 నిమిషాల పాటు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం వీడియోను ఎందుకు బయట పెట్టడంలేదన్నది అంతుచిక్కడంలేదు. పైనుంచి, రాజకీయ వత్తిళ్లు ఏమైనా పోలీసుల మీద ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అనేక కేసులో తాము సేకరించిన ఆధారాలను బయటపెట్టే పోలీసులు విజయ్ ఆత్మహత్య కేసులో కీలకమైన సెల్ఫీ వీడియోను ఎందుకు బయట పెట్టడంలేదన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ విజయ్ సెల్పీ వీడియోలో ఇంకెవరైనా పలుకుబడి కలిగిన ప్రముఖుల పేర్లు చెప్పిండా? లేక ఇప్పటికే బయటకొచ్చిన పేర్లలో ఉన్నవారెవరైనా హైలెవల్ లో వత్తిడి తెచ్చి వీడియో బయటకు రాకుండా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా ఈ కేసు కూడా మరో బ్యూటీషియన్ శిరీష కేసులాగే కోల్డ్ స్టోరేజీ లోకి నెట్టబడుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

click me!