మాకు తెలంగాణ , పంజాబ్ రెండూ ఒకటే .. రైతులను ముందుపెట్టి కేసీఆర్‌ రాజకీయాలు : పీయూష్ గోయల్

Siva Kodati |  
Published : Mar 24, 2022, 04:33 PM ISTUpdated : Mar 24, 2022, 04:35 PM IST
మాకు తెలంగాణ , పంజాబ్ రెండూ ఒకటే .. రైతులను ముందుపెట్టి కేసీఆర్‌ రాజకీయాలు : పీయూష్ గోయల్

సారాంశం

మాకు పంజాబ్ అయినా తెలంగాణ అయినా ఒకటేనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రం నుంచైనా తాము బియ్యాన్ని మాత్రమే సేకరిస్తామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 

ధాన్యం కొనుగోళ్లకు (paddy procurement) సంబంధించి తాము ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపించడం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) . ఢిల్లీలో గురువారం తనను కలిసిన తెలంగాణ మంత్రుల బృందంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌కు (punjab) అనుసరిస్తోన్న విధానమే తెలంగాణకూ అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. రా రైస్ ఎంత ఇస్తామనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదని పీయూష్ గోయల్ మండిపడ్డారు. 

తెలంగాణ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ నేతల అసత్యాలతో అక్కడి రైతుల్ని ఇబ్బందుల్లో పెడుతున్నారని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 22, మార్చి 8 తేదీల్లో సమావేశాలకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని.. అయితే ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ మండిపడ్డారు. 

అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు, కేంద్రం బియ్యాన్ని మాత్రమే సేకరిస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తున్నామని.. నేరుగా ధాన్యాన్ని కేంద్రం సేకరించదని ఆయన పేర్కొన్నారు. రైతులకు భ్రమలు కల్పిస్తూ కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని పీయూష్ గోయల్ ఫైరయ్యారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ (kcr) రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంజాబ్ అయినా తెలంగాణ అయినా మాకు ఒక్కటేనని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 

అంతకుముందు గురువారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని పీయూష్ గోయల్ చాంబర్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , TRS  ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. యాసంగిలో రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.  ఇదే విషయమై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ కూడా రాశారు. 

తొలుత పీయూష్ గోయల్ ను తెలంగాణ మంత్రుల బృందం బుధవారం నాడు కలిసింది. అయితే ఇవాళ కలుద్దామని కేంద్ర మంత్రి తెలంగాణ మంత్రులకు సూచించారు. దీంతో ఇవాళ తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదనే సంకేతాలు కేంద్రం నిన్ననే ఇచ్చింది.  సరఫరా పరిస్ధితుల ఆధారంగానే వరి ధాన్యం  కొనుగోళ్లు జరుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంకేతాలు ఇచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu
Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?