
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం హైదరాబాద్‌లో మూసి వరదను పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉండిపోయారని మండిపడ్డారు. ఈ ఏడాది వరదలు వస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ నాలుగు రోజులు ఏం చేస్తున్నారో తెలియదన్నారు. రాష్ట్రంలో ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ పాలనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. కొడుకు మీద వాత్సల్యంతో కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోరుతున్న ఎస్‌డీఆర్ఎఫ్ నిధులకు ఆడిట్ లేదని విమర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులపై కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.