ఎంఐఎంను బలోపేతం చేసేందుకు కేసీఆర్ కొత్త పార్టీ.. కల్వకుంట్ల కుటుంటానివి పగటి కలలు: కిషన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Oct 3, 2022, 1:29 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడిస్తానని కేసీఆర్ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అప్పుడే ప్రధాని అయినట్టుగా.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కవిత కేంద్ర మంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం అయినట్టుగా కల్వకుంట్ల కుటుంబం పగటి కలలు కట్టుందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ పార్టీ కూడా కేసీఆర్‌తో కలిసి రావడం లేదని అన్నారు. కేసీఆర్‌తో ఏకీభవించలేదని ఆయనను కలిసిన నాయకులే చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో అర్థంకాక టీఆర్ఎస్ నేతలే తలలు పట్టుకుంటున్నారని ఆరోపించారు. 

కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ నేరుగా బుల్లెట్ బండిపై వెళ్తారని అన్నారు. టీఆర్ఎస్‌కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమేనని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారని మండిపడ్డారు. 

Also Read: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నిర్ణయం..

బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. మునుగోడులో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

click me!