తెలంగాణలో బీజేపీకి బలం లేదంటూ స్వయంగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో ఏ ఒక్కరో చేరనంత మాత్రాన పార్టీకి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీలో ఏ ఒక్కరో చేరనంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుందని భావించొద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోకి వస్తామని చెప్పినవారంతా వచ్చారని అన్నారు. పార్టీని వీడి ఎవరూ వెళ్లడం లేదని.. నాయకులు చేరినంత మాత్రాన పార్టీ గెలవదని, ప్రజల ఆశీస్సులతోనే విజయం వరిస్తుందన్నారు. కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ నిరాశ, నిస్పృహలకు గురికాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 25 రాష్ట్రాల్లో గెలిచామని, ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన పనిలేదని ఆయన తెలిపారు.
కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీజేపీలో చేరడం కష్టమేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. సోమవారం నాడు రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ తాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ లేదన్నారు. పొంగులేటి ,జూపల్లి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటివరకు వారు కాంగ్రెస్ లో చేరకుండా ఆపగలిగినట్టుగా ఆయన వివరించారు. బీజేపీలో ఈ ఇద్దరూ నేతలు చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.
ALso Read: నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు: పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై ఈటల
ఖమ్మంలో ఇప్పటికీ కమ్యూనిష్టు ఐడియాలజీ బలంగా ఉందన్నారు. దేశానికి కమ్యూనిష్టు సిద్దాంతం నేర్పిన గడ్డ తెలంగాణే అనే విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఖమ్మంలో వామపక్షాలు, టీడీపీ సహా అన్ని పార్టీలున్నాయన్నారు. ప్రియాంకగాంధీని అప్పట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలుస్తారని తెలిసిందన్నారు. దీంతో అంతకంటే ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు.