సూర్యాపేట: పారిశుద్ద్య కార్మికురాలి ఇంట్లో టిఫిన్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Aug 20, 2021, 12:21 PM IST
Highlights

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం ఉత్తమ పారిశుద్ద్య కార్మికురాలు మార్తమ్మ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి అల్పాహారం చేశారు. 

సూర్యాపేట: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరుకుంది. గురువారం ఏపీలోని తిరుపతి, విజయవాడలో యాత్రను ముగించుకుని రాత్రికి సూర్యాపేటకు చేరుకున్నారు కేంద్ర మంత్రి. ఇవాళ(శుక్రవారం) సూర్యాపేట పట్టణంలో బిజెపి శ్రేణులతో కలిసి కేంద్ర మంత్రి యాత్ర చేపట్టనున్నారు. 

అయితే శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్మికులు మార్తమ్మ ఇంటికి వెళ్లారు కిషన్ రెడ్డి. కరోనా విజృంభణ సమయంలో కనీసం ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా విధులకు హాజరయిన మార్తమ్మకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డును అందజేసింది. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న కేంద్రమంత్రి మరోసారి మార్తమ్మను అభినందించడానికి చింతలచెరువులోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా మార్తమ్మ కుటుంబసభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. 

అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావుతో పాటు ఇతర బిజెపి నాయకులతో కలిసి పట్టణంలో ఏర్పాటుచేసిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు విగ్రహంవద్దకు వెళ్లారు కిషన్ రెడ్డి. సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 

 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ఆశీర్వాద యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉత్తమ పారిశుధ్య కార్మికురాలు మెరుగు మార్తమ్మను కలవడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కాలంలో ఒక్కరోజు కూడా పని మానకుండా ప్రజల ఆరోగ్యం కోసం పని చేసిన మార్తమ్మ అభినందనీయరాలు అన్నారు.

read more  తాడేపల్లి: జగన్‌ను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఘనంగా సత్కరించిన సీఎం

''దేశ వ్యాప్తంగా కరోనా ఉచిత వాక్సిన్లను అందిస్తున్నాం. త్వరలోనే చిన్నారులకు వాక్సిన్లు అందుబాటులోకి తెస్తాం. ప్రజలు బాధ్యతగా వాక్సిన్లను తీసుకుని కరోనాని ఓడించాలి'' అని సూచించారు.

''కరోనా కాలంలో నిరుపేదలను ఆదుకోడానికి దీపావళి వరకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాం....అవసరమైతే ఇంకా పొడిగిస్తాం. కరోనా వారియర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. జర్నలిస్టులకు కూడా రూ.5లక్షల భీమా ఇస్తున్నాం. కరోనా మృతుల పిల్లల చదువుల బాధ్యత కేంద్రం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. కరోనా కష్ట కాలంలో పని చేసిన వారియర్లందరికి పాదాభివందనాలు'' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

click me!