ఐటీ సోదాలతో మాకేం సంబంధం:కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Nov 2, 2023, 1:42 PM IST

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు తెలంగాణలో  రాజకీయ కలకలం రేపుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.ఈ విషయమై  కాంగ్రెస్  నేతలు  ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నాయి.
 


హైదరాబాద్: నగరంలో పలువురు  కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులతో తమకు ఏం సంబంధమని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.

గురువారంనాడు హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  న్యూఢిల్లీ నుండి ఇవాళ మధ్యాహ్నం ఆయన హైద్రాబాద్ కు చేరుకున్నారు.  బీజేపీ మూడో అభ్యర్ధుల జాబితా విషయమై పార్టీ నాయకత్వంతో  చర్చించేందుకు ఆయన న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

Latest Videos

ఇవాళ ఉదయం నుండి  కాంగ్రెస్ పార్టీకి చెందిన బడంగ్ పేట మున్సిపల్ చైర్ పర్సన్ పారిజాత నర్సింహరెడ్డి, మహేశ్వరం  కాంగ్రెస్ అభ్యర్ధి  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మరో వైపు వంగేటి లక్ష్మారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి బంధువు గిరిధర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

బీఆర్ఎస్ కోసం బీజేపీ  నేతలు  కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈ ఆరోపణలపై  మీడియా ప్రశ్నకు  కిషన్ రెడ్డి స్పందించారు.  హైద్రాబాద్ లో ఎక్కడెక్కడ  ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారో కూడ తనకు తెలియదన్నారు. ఐటీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించాలో తాము ఎలా చెబుతామని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  దర్యాప్తు సంస్థలు స్వతంత్ర్యంగా వ్యవహరిస్తాయనే విషయం విమర్శించే వారికి తెలియదా అని ఆయన  ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల  30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, అభ్యర్ధుల ఖరారు వంటి అంశంలో ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి.ఈ తరుణంలో  ఐటీ అధికారుల సోదాలు  ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు  దారి తీశాయి.

click me!