
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న రాష్ట్రంలో బీజేపీ క్యాంపెయిన్ ఉధృతం చేయాలని భావిస్తున్నది. నెలకోసారి తాను తెలంగాణకు వస్తానని ఈ దృష్టిలోనే కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. అయితే.. గత నెల ఆయన అనివార్య కారణాల వల్ల తెలంగాణకు రాలేకపోయారు. కనీసం రెండు సార్లు ఆయన తెలంగాణ పర్యటన వాయిదా పడింది. దీంతో అమిత్ షా పర్యటనపై అస్పష్టత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నెలలో ఆయన తెలంగాణకు వస్తున్నారని సమాచారం అందింది. అదీ.. ఈ నెలాఖరులో ఆయన తెలంగాణకు రానున్నారు.
అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ అధిష్టానం ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన ఆయన తెలంగాణకు రాబోతున్నారు. అదే రోజున తెలంగాణ బీజేపీ ఖమ్మం జిల్లాలో భారీ సభ నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది. ఈ సభకు అమిత్ షా హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా పర్యటనలు వరుసగా వాయిదాలు పడటం రాష్ట్ర బీజేపీ నాయకత్వం, క్యాడర్‌లోనూ నిరాశను నింపుతున్నది. అందుకే ఈ నెల ఎలాగైనా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన కచ్చితంగా చేసే తీరాలని రాష్ట్ర నేతలకు అధిష్టానానికి విన్నవించుకున్నట్టు తెలిసింది.
కాగా, తెలంగాణ బీజేపీ కూడా దూకుడు పెంచుతున్నది. విజయ సంకల్ప యాత్రలకు ప్లాన్ వేస్తున్నది. ఈ యాత్రలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఒక్కో యాత్రలో ఒక్కో రాష్ట్ర బీజేపీ లీడర్ కీలకంగా వ్యవహరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు విజయ సంకల్ప బాధ్యతలను ఎత్తుకోనున్నారు. రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచుతున్న తరుణంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రావడం బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది.