
Telangana: యాసంగి సీజన్‌లో వరి పంటలను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తూ అన్నదాతల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా రైతు మహా ధర్నా పేరుతో గురువారం నాడు మంచిర్యాలలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరిధాన్యాల కొనుగోళ్లను తగ్గించి కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని బాల్క సుమన్ అన్నారు. ధాన్యాన్ని కేంద్రం ఏ ధరకైనా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతుల కంటే అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రమంత్రులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపుతున్నదనీ, ఇది అన్యాయమైన విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో 100 శాతం వరిని సేకరిస్తున్నదని తెలిపారు. తెలంగాణ నుంచి ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తులను సేకరిస్తారా లేదా అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు అనేక విషయాల్లో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోళ్ల విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరుపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పష్టత ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు సూచించారు. కనీస మద్దతు ధర లభిస్తుందో లేదో అన్న సందిగ్ధంలో వరిసాగుదారులు ఇంకా ఉన్నారని ఆయన వాపోయారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అవసరమైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటాల తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు భీమా, పంట రుణాల మాఫీ, రైతు బంధు సమితిల ఏర్పాటు, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడాన్ని ఆయన ఉదహరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్వరమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జిల్లా గ్రంథాలయాల కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆర్ ప్రవీణ్, రైతు బంధు సమన్వయకర్త గురువయ్య సహా మరికొంత మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.