
అదిలాబాద్ : పెళ్లైన పదహారేళ్లకు లేక లేక పుట్టిన కొడుకును అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఆ దంపతులు. ఇంతలోనే ఆ చిన్నారిని మృత్యువు రూపంలో పాము పలకరించింది. చనిపోయింది అనుకున్న పాము.. విచిత్రంగా ఆ బాలుడిని కాటేసింది. వారికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాలంలో చోటుచేసుకుంది. బైరెడ్డి సంతోష్-అర్చన దంపతుల కుమారుడైన నైతిక్ (2) గురువారం వేకువజామున నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో పాము కనిపించడంతో గ్రామంలోని వారు దాన్ని కర్రతో కొట్టి చంపేశారు. అచేతనంగా పడి ఉంటే చనిపోయింది అనుకుని దాని పక్కకు జరిపారు. చనిపోయిన పామును చూడడానికి అందరూ గుమిగూడారు. అందులో బాబును ఎత్తుకున్న పక్కింటి మహిళ కూడా ఉంది. అందరూ చనిపోయిన పామును వింతగా గమనిస్తూ ఉండగా.. ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలోని చిన్నారి నైతిక్ ను కాటేసింది. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న గ్రామస్తులు బాలుడిని హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి నైతిక్ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకాలు మిన్నంటాయి.
భార్యను పాము కాటేసిందని.. ఆ భర్త ఏం చేశాడంటే...
నిరుడు ఆగస్ట్ లో హర్యానాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిరుడు జనవరిలో ఆమెకు పాము కాటు వేసింది. వెంటనే హాస్పిటల్లో చేర్పించడం వల్ల ఆమె ప్రాణాలు కాపాడుకుంది. అయితే పాముకాటు ప్రభావం వల్ల ఆమె చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఇంటికి క్షేమంగా వచ్చిన భార్యను భర్త ఆదరించక పోగా… మారిపోయిన చర్మం రంగును చూసి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఓ పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
జాజ్వన్ గ్రామానికి చెందిన జరీనా అనే మహిళను ఈ ఏడాది జనవరిలో విషపూరిత సర్పం కాటు వేసింది. ఆమెను వెంటనే భర్త అనిల్ హాస్పిటల్ కు తరలించడంతో సకాలంలో చికిత్స అందింది. దీంతో ఆమె బతికి బయటపడింది. అయితే విష ప్రభావం కారణంగా ఆమె శరీరం నల్లగా మారిపోయింది. దీంతో భార్యపై అనిల్ అసహ్యం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలనుకున్నాడు. అంతకంటే ముందు ఒక బైక్, ఒక కారును ఆమె పేరు మీద కొన్నాడు. వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించాడు.
నిరుడు, జూన్ 30వ తేదీన ఆమెను ఓ ట్రక్కు కిందకి తోసేసి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి తన భార్యను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు ఫిర్యాదు చేశాడు. అలాగే తన భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని 15 లక్షల రూపాయలు పొందాడు. జరీనా మరణం విషయంలో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించారు. జరీనాకు ప్రమాదం జరిగినట్టు అనిల్ చెప్పిన చోటుకు వెళ్ళి పరీక్షించారు. అయితే అనిల్ చెబుతున్నది అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ ను కోర్టు ముందు సోమవారం హాజరుపరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది.