
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) ఐటీ నగరంగా రూపుద్దిద్దుకున్నా కొన్నిప్రాంతాలు మాత్రం అభివృద్దికి ఆమడదూరంలో నిలిచాయి. ఐటీ కంపనీలు కొలువైన హెటెక్ సిటీ ప్రాంతం, బడాబాబులు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలపైనే జిహెచ్ఎంసి, ప్రభుత్వం దృష్టి పెట్టిందని... మిగతా ప్రాంతాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా వీధికుక్కల దాడిలో రెండేళ్ళ బాలుడి మృతి చెందిన ఘటన గోల్కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని గోల్కొండ బడాబజార్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడు అనస్ అహ్మద్ ఇంటిబయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడిచేసాయి. దీంతో బాలుడి శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు బాలున్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. హాస్పిటల్ కు చేరుకున్నాక డాక్టర్లు పరిశీలించి బాలుడు మృతిచెందినట్లు నిర్దారించారు.
కుక్కల దాడిలో కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీధికుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతిచెందడంతో బడాబజార్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని... వారి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు బలయ్యాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.