
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమయ్యిందనో, ఉద్యోగం రాలేదనో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇదివరకు కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తండ్రి కోపడ్డాడని ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిిపోకముందే.. అలాంటి మరో ఘటన వెలుగు చూసింది.
ఫోన్, టీవీ రీచార్జ్ చేయలేదని మనస్తాపం చెందిన ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనకు మీద స్థానికులు.. పోలీసులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో కూలీపని చేసుకునే ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. మూడేళ్ల కిందట భర్త ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పిల్లలు ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నారు. పెద్ద కొడుకు ఆరో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. టీవీ రీచార్జ్ అయిపోయిందని చేయించమని అడిగాడు. దాంతోపాటే ఫోన్ కూడా రీఛార్జ్ చేయించమని కోరాడు.
రీల్స్ పిచ్చి.. చదువుకొమ్మని తండ్రి మందలింపు.. మనస్తాపంతో తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య...
టీవీకి సంబంధించిన వైర్లను ఎలుకలు కొరికేయడంతో టీవీ రావడంలేదని.. అది రిపేర్ చేయించాలని తల్లి చెప్పింది. ఆ వైర్లు రిపేరు చేయించిన తర్వాత ఫోన్ తో పాటు, టీవీ కూడా రీఛార్జి చేస్తానని చెప్పింది. ఆ తర్వాత ఎడ్లకు మేత పెట్టాలని బయటకి వెళ్లిపోయింది. ఆ మాటలకు ఆ బాలుడు మన స్థాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఇంటి పైకప్పు పైపుకు ఉరేసుకున్నాడు. వాళ్లది రేకుల ఇల్లు కావడంతో.. ఆ శబ్దాలకు ఇంటి చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వచ్చి చూసేసరికి.. బాలుడు చీరతో ఉరివేసుకొని కనిపించాడు.
వెంటనే వారు బాలుడిని ఉరి నుంచి దించి…తల్లికి సమాచారం అందించారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే దగ్గర్లోని మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి పిల్లాడిని తరలించారు. ఈ క్రమంలోనే బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో అబ్బాయిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగానే నిర్ధారించారు. చిన్న విషయానికే క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోయిన కొడుకును చూసి ఆ తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నాయి. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనతో టీవీ, ఫోన్లకు పిల్లలు ఎంతగా అడిక్ట్ అయ్యిందో తెలుస్తోందని ఈ ఘటన గురించి విన్న వారంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.