వ్యక్తిగత ఎదుగులను చూసి పిరికి పందలు తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కృష్ణయ్య హత్య వెనుక ఎవరున్నా కూడా ఉపేక్షించబోమన్నారు.
ఖమ్మం: వ్యక్తిగత ఎదుగులను చూసి పిరికి పందలు తమ్మినేని కృష్ణయ్యను దుండగులు హత్య చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి సమీపంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య సోమవారం నాడు ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తమ్మినేని కృష్ణయ్య మృతదేహం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాలం చెల్లిన కొందరు అరాచకాలతో ఘాతుకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
ఇలాంటి ఘటనలతో అభివృద్ది ఆగిపోతుందని చెప్పారు. తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఉన్నవారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ హత్యకు నిరసనగా తెల్దారుపల్లిలో తమ్మినేని కోటేశ్వరరావు ఇంటితో పాటు గ్రామంలోని సీపీఎంకు చెందిన నాయకుల ఇళ్లపై తమ్మినేని కృష్ణయ్య అనుచరులు దాడికి దిగారు. గ్రామంలోని సీపీఎం జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. తమ్మినేని కృష్ణయ్య హత్యకు ప్రతీకారంగా తమ్మినేని కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్ కంపెనీపై కృష్ణయ్య అనుచరులు దాడి చేశారు. గ్రానైట్ కంపెనీలో ఉన్న ప్రొక్లెయినర్ ను దగ్దం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాబాయ్ కొడుకే తమ్మినేని కృష్ణయ్య. కొంత కాలం క్రితం తమ్మినేని కృష్ణయ్య సీపీఎంను వీడి టీఆర్ఎస్ లో చేరారు. సీపీఎంకు చెందిన వారే ఈ హత్యచేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
also read:టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో హైటెన్షన్.. 144 సెక్షన్ విధించిన పోలీసులు
తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన ప్రాంతాన్ని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ పరిశీలించారు. తమ్మినేని కృష్ణయ్య హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
తుమ్మలకు మంత్రి కేటీఆర్ ఫోన్
ఖమ్మం జిల్లా తెల్తార్ పల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు విషయమై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ఘటన వివరలను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని కృష్ణయ్యను దారుణంగా హత్య చేశారని తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్ కు వివరించారు. ఈ విషయమై తాను డీజీపీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదన్నారు. అయితే తాను ఈ విషయమై డీజీపీతో మాట్లాడుతానని కేటీఆర్ చెప్పారు.