ఎన్టీఆర్ షూటింగ్: బాలయ్యతో టీటీడీపీ నేతల భేటీ (వీడియో)

By narsimha lodeFirst Published Oct 11, 2018, 12:58 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రచారం నిర్వహించాలని టీటీడీపీ నేతలు  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణను గురువారం నాడు కోరారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రచారం నిర్వహించాలని టీటీడీపీ నేతలు  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణను గురువారం నాడు కోరారు. టీటీడీపీ నేతల ఆహ్వానాన్ని బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దసరా తర్వాత  తన టూర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని బాలయ్య టీడీపీ నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఇటీవల ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ  విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటన విజయవంతమైందని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాలకృష్ణతో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం నాడు టీటీడీపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ,  నేతలు  పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హైద్రాబాద్ సారధి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణతో సుమారు గంటకు పైగా చర్చించారు.

గ్రేటర్ హైద్రాబాద్  నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల తరపున బాలకృష్ణతో ప్రచారం నిర్వహించాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహాబూబ్ నగర్ జిల్లాల్లోని పలు  అసెంబ్లీ సెగ్మెంట్లలో  బాలయ్యతో  ప్రచారం నిర్వహించేలా టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ విషయమై  బాలకృష్ణతో  ఎల్. రమణతో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు.  దసరా తర్వాత  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బాలయ్య సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే దసరా తర్వాత వీలు చూసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని  టీటీడీపీ నేతలు చెబుతున్నారు.

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు పూర్తయ్యాక మరోసారి బాలకృష్ణతో చర్చించాలని  ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హైద్రాబాద్ సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్  విరామ సమయంలో  టీటీడీపీ నేతలు బాలకృష్ణతో చర్చించారు.

మరోవైపు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే సందర్భంగా పార్టీ జెండా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే టీటీడీపీ నేతలు బాలయ్యతో సమావేశమయ్యారు. 

 

"

click me!