
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ ఎం. వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.
కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ వన్ డిపోకు చెందిన బస్సు కారమారెడ్డి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.