
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎక్కువగా అది ప్రజలకు సేవ అందించడాన్ని గురించిన విషయాలతో వార్తల్లోకి ఎక్కేది. లేదంటే.. టికెట్ రేట్ల మార్పులతో హెడ్‌లైన్స్‌కు ఎక్కేది. కానీ, తాజాగా అవాంఛనీయ కారణంతో చర్చకు తెరలేపింది. ఎఫీషియన్సీ కోసం మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. సిబ్బంది తాము ఎదుర్కొంటున్న పీడన చర్చనీయాంశం అవుతున్నది. ఎఫిషియెన్సీ పెంచడానికి బస్ డిపోలు సెలవులు వద్దనే పాలసీ ఎంచుకుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బంది ఒక వేళ ఎమర్జెన్సీ సెలవు తీసుకోవాలన్నా.. దానికి సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలని పై అధికారులు ఆదేశిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ టర్మినల్ కూడా మినహాయింపేమీ కాదు.
అయితే, ఈ టర్మినల్‌కు చెందిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన సమీప బంధువు మరణించడంతో సెలవు కావాలని అధికారులను కోరాడు. అంత్యక్రియలకు హాజరుకావడానికి సెలవు కావాలని విజ్ఞప్తి చేశాడు. దానికి ఆ అధికారి వివాదాస్పద ఆదేశం ఇచ్చాడు. అలాగైతే.. అందుకు సంబంధించిన ప్రూఫ్ ఇవ్వాలని, డెడ్‌బాడీతో సెల్ఫీ తీసి పంపాలని ఆర్డర్ చేశాడు. ఈ ఆదేశంతో సదరు డ్రైవర్ తీవ్రంగా కలత చెందాడు.
అంత్యక్రియలకు వెళ్తున్న డెడ్‌బాడీతో తాను ఎలా సెల్ఫీ తీసుకోగలనని? ఆ డ్రైవర్ బాధపడ్డాడు. ఇది చాలా దారుణం అని అభిప్రాయపడ్డాడు. హృదయం లేని తమ పై అధికారులు చేసిన అమానవీయ ఆదేశాలు ఇవి అని ఆవేదనకు లోనయ్యాడు. ఆ డ్రైవర్ తన గుర్తింపును బయట పెట్టడానికి నిరాకరించాడు.
ఎఫీషియెన్సీ పెంచడానికి మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటున్న తరుణంలో బస్సు డిపోలు నో పాలసీ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ కారణంగా ఇటీవలి కాలంలో సెలవు పెడుతున్న డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ సంఖ్యలో చార్జ్ మెమోలు అందుకుంటున్నారు. ఇటీవలే ఇదే హెచ్‌సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఏ శ్రీనివాస్ ఆత్మహత్యతో ఈ విధానంపై చర్చ మొదలైంది. సెలవు పెట్టినందుకు చార్జ్ మెమో అందుకున్న డ్రైవర్ శ్రీనివాస్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం, వంద రోజులపాటు సెలవు పెట్టకుండా డ్యూటీకి వస్తే.. రూ. 1,500 ఇన్సెంటివ్ లభిస్తుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బందిని ప్రోత్సహించే విధానం సరిగా లేదని అర్థం అవుతున్నది. ఎందుకంటే.. అది ప్రోత్సాహకంలా కాకుండా.. వారంతా కచ్చితంగా విధులు నిర్వర్తించాలని బలవంతపెట్టినట్టుగా మారిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు వెల్లడించారు.
తాను తన రెండు దశాబ్దల సర్వీసులో ఇలాంటటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఓ డ్రైవర్ తెలిపాడు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం తమ వంటి ఇతర డ్రైవర్లు కూడా శ్రీనివాస్‌లాగే తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చని చెప్పాడు.