
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు జారీచేసింది. ఈరోజు ఉదయం బండి సంజయ్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు.. ఆయనకు నోటీసులు అందజేశారు. రేపు (మార్చి 26) తమ ఎదుట హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 91 కింద ఈ నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను ఇవ్వాలని తెలిపారు. అయితే గతంలోనే బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఆయన హాజరుకాకపోవడంతో సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
బండి సంజయ్‌కు నోటీసులు జారీచేసిన అనంతరం అధికారులు మాట్లాడుతూ.. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో తాము మళ్లీ నోటీసులు ఇచ్చినట్టుగా అధికారులు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు సర్వ్ చేయడం జరిగిందని అన్నారు. బండి సంజయ్ నోటీసులు తీసుకున్నారని.. రేపు హాజరవుతానని చెప్పారని తెలిపారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చే సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో.. అధికారులు ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు.. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. సిట్‌పై తనకు నమ్మకం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక, బండి సంజయ్ మాత్రం తాను సిట్‌తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోవాలని అనుకోవడం లేదని చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేస్తేనే అన్ని ఆధారాలను సమర్పిస్తానని తెలిపారు.