గడ్డి అన్నారం మార్కెట్ ఖాళీ చేయాల్సిందే.. వ్యాపారులకు తేల్చిచెప్పిన హైకోర్ట్, శుక్రవారం వరకు డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Mar 15, 2022, 9:55 PM IST
Highlights

గడ్డి అన్నారం మార్కెట్‌ను ఖాళీ చేయాల్సిందేనని తెలంగాణ హైకోర్టు వ్యాపారులను ఆదేశించింది. ఇందుకోసం శుక్రవారం వరకు డెడ్‌లైన్ విధించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఎలాంటి స్టెప్ వేస్తారో వేచి చూడాలి. 

గడ్డి అన్నారం మార్కెట్‌ (Gaddi Annaram market) తరలింపుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈనెల 18 నాటికి మార్కెట్‌ను ఖాళీ చేయాలని వ్యాపారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమని ధర్మాసనం పేర్కొంది. గడ్డి అన్నారం మార్కెట్‌ను బాట సింగారం తాత్కాలిక మార్కెట్‌కు (batasingaram fruit market) తరలించి.. అక్కడ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేవంటూ వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతోంది. 

వ్యాపారులు ఖాళీ చేసేందుకు వీలుగా నెల రోజులపాటు మార్కెట్‌ తెరవాలని గత నెలలో మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ మార్కెట్‌లోకి వెళ్లనీయడం లేదని మళ్లీ వ్యాపారులు న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో హుటాహుటిన మార్కెట్‌ తెరిచారు. అదే సమయంలో మార్కెట్‌లో కూల్చివేతలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మంగళవారం మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ను తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కూల్చివేతలు నిలిపివేసినట్టు ఇవాళ హైకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం నాటికి వ్యాపారులు మార్కెట్‌ ఖాళీ చేసి బాటసింగారం వెళ్లాలని చెబుతూ.. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.  

మరోవైపు హైదరాబాద్ నగరానికి నాలుగు దిక్కులా నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను 1000 పడకలతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. గచ్చిబౌలిలో ఇప్పటికే ఉన్న టిమ్స్‌లో మరికొన్ని భవనాలు నిర్మిస్తారు. సనత్‌నగర్‌ ఛాతీ ఆస్పత్రి, ఎల్బీ నగర్‌ వద్ద గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌, ఆల్వాల్‌.. ఇలా మరో మూడు ప్రాంతాల్లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నారు.  అయితే ఈ కారణంగానే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను బాట సింగారానికి తరలించారు. 

నగరంలో నిర్మించే ఆస్పత్రులన్నీ ఎయిమ్స్‌ తరహాలో ఉండాలని అధికారులను సీఎం (kcr) ఆదేశించారు. ఎయిమ్స్‌లను ఒక్కోక్కటి 14 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. మన దగ్గర మాత్రం 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే అవకాశం ఉంది. కన్సల్టెన్సీలు ఇప్పటికే సర్వే పనులు ప్రారంభించాయి. సర్కారు జీవో జారీ చేయగానే రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరుకే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. నగరంలో నిర్మించే ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

ఈ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.21 వేల కోట్ల రుణాన్ని ఎస్బీఐ కేపిటల్ అందించనుంది. 1000 పడకలతో నిర్మించే ప్రతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.900 కోట్ల ఖర్చవుతుందని అంచనా. నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, మెడికల్‌ ఎక్వి‌ప్ మెంట్‌తో కలుపుకొని ఈ మేరకు అంచనా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్‌తో కలుపుకొని 6 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 8 మెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలను శరవేగంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

click me!