టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్య పోటీ, మిగిలిన పార్టీలు లెక్కలో లేవ్:కేసీఆర్

By Nagaraju TFirst Published Nov 26, 2018, 3:53 PM IST
Highlights

ముందస్తు ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్యేనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 

జగిత్యాల: ముందస్తు ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్యేనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రజలు ఒక్కటే గుర్తుంచుకోవాలని ప్రజాకూటమి, టీఆర్ఎస్ పార్టీలే పోటీలో ఉన్నాయని మిగిలిన పార్టీలు లెక్కల్లో లేవన్నారు. కాంగ్రెస్, టీడీపీ కూటమి 58 ఏళ్లు పరిపాలించిందని ఏనాడైనా ప్రజల సంక్షేమం కోసం పాటుపడిందా అని ప్రశ్నించారు. 

15ఏళ్లపాటు ఉద్యమం చేసి నాలుగేళ్లు అద్భుత పాలన అందించిన టీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఉందని అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరారు. తాను పర్యటిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు 70వేల నుంచి 80 వేల మంది ప్రజలు హాజరవుతున్న విధానం చూస్తుంటే టీఆర్ఎస్ దే గెలుపు అని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

కాంగ్రెస్,టీడీపీ నాయకులు ఇద్దరూ ఘనాపాటిలేనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకంటూ ఎగతాళి చేశారని గుర్తు చేశారు. 

తెలంగాణ ఏర్పడితే అంధకారమేనని అంతా చెమ్మ చీకటేనని చెప్పాడని కానీ నేడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. మేధావులు ఉన్నారని చెప్పిన ఏపీలోనే 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. రైతాంగానికి 24 గంటలు విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పీడ మళ్లీ తెలంగాణకు అవసరమా అంటూ నిలదీశారు. చావునోట్లో పెట్టి సాధించిన తెలంగాణలో తెలంగాణ పెత్తనాన్ని ఎందుకున్నారు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నారని, అలాగే సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టలపై కేసులు వేసి ఎన్నో ఇబ్బందులు సృష్టించారన్నారు.  
 

తెలంగాణకు అడ్డంపడ్డ చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ఎందుకు భుజాలపై తీసుకువస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదని కేసీఆర్ మండిపడ్డారు. అధికారం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెడతారా అంటూ ధ్వజమెత్తారు. వలసాధిపత్యాన్ని తెలంగాణపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందరికి నీళ్లు అందిస్తామని తెలిపారు. గత పాలకుల అవివేక చర్యల వల్ల ఎస్ఆర్పీసీ ఎండిపోయిన పరిస్థితి అన్నారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్పీసీ ఎండిపోదని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

గోదావరి నది నుంచి నీళ్లు రాకపోతే ఒకవేళ ఎస్ఆర్ పీసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీళ్లను నింపుతామన్నారు. వచ్చే జూన్ తర్వాత ఎస్ఆర్సీపీ ప్రాజెక్టు నిండు కుండలా ఉంటుందన్నారు. ఎస్ఆర్పీసీ రైతులకు వరప్రదాయినిగా మారబోతుందన్నారు. 

అలాగే జగిత్యాల జిల్లా చేస్తానని గతంలో హామీ ఇచ్చానని అలాగే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే కోరుట్ల రెవెన్యూ డివిజన్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని అయినా తాను ఏనాడు వివక్ష చూపలేదన్నారు. తెలంగాణలో ప్రతీ ఇంచు కేసీఆర్ కు చెందినదేనని ఆయన ఆత్మ ప్రతీ ఇంచుకోసం పోరాడుతుందన్నారు. 
 
ఇకపోతే రాబోయే రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని తెలిపారు. ఎంఐఎంతో సహా టీఆర్ఎస్ పార్టీ 17 మంది ఎంపీలను గెలిపించాలని కోరారు. 17 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మనకు రావాల్సిన హక్కులు సాధించుకుందామని హామీ ఇచ్చారు. జగిత్యాల అభ్యర్థి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

click me!