కాంగ్రెస్-బీజేపీలవి దొంగనాటకాలు, హుజూర్ నగర్ మనదే: మంత్రి కేటీఆర్

By Nagaraju penumalaFirst Published Oct 12, 2019, 4:51 PM IST
Highlights

ప్రజల్లో బలం లేదని తెలిసిన బీజేపీ కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పని చేస్తోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 
 

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి పార్టీ నేతలు, ఇంచార్జ్ లు, సీనియర్ నేతలతో తెలంగాణ భవన్ లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. 

ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వారం రోజులపాటు నేతలు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. 

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే హుజూర్ నగర్ అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. కేంద్రం నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రంలోగానీ ఎక్కడా అధికారంలో లేనివారు నిధులు ఎక్కడ నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు మంత్రి కేటీఆర్. ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం ఉందని నిలదీశారు. నియోజకవర్గానికి ఏం చేశారో కూడా చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని విమర్శించారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఓడిపోతాయని తెలిసి కూడా కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయం ప్రజలకు తెలియజేయాలని పార్టీ నేతలుకు సూచించారు. 
 
టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యర్థులమని చెప్పుకుంటున్న బీజేపికీ ఈ ఎన్నికల్లో తమ బలమేంటో తెలిసిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడం కష్టమేనన్నారు. ప్రజల్లో బలం లేదని తెలిసిన బీజేపీ కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పని చేస్తోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 

click me!