నా చుట్టూ తిరిగితే పదవులు రావు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Jan 2, 2019, 1:44 PM IST
Highlights

మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటేడ్ పదవుల కోసం పైరవీలు చేస్తున్న నేతలను ఉద్దేశించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటేడ్ పదవుల కోసం పైరవీలు చేస్తున్న నేతలను ఉద్దేశించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఇవాళ సనత్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గోన్న ఆయన తన చుట్టూ తిరిగితే ఎలాంటి పదవులు రావని, బాగా పనిచేస్తే పదవులు వాటంతటే అవే వస్తాయని స్పష్టం చేశారు. 2014లో కేవలం 34 శాతం ఓట్లు పడితే తాజా ఎన్నికల్లో 47 శాతం ఓట్లు టీఆర్ఎస్‌కు పడ్డాయని కేటీఆర్ తెలిపారు.

గెలిచిన వెంటనే గర్వంతో విర్రవీగకూడదని మెజారిటీ, సీట్లు, ఓటింగ్ శాతం పెరిగిందంటే టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో విశ్వాసానికి నిదర్శనమన్నారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ రెండే సీట్లు గెలిచామని, కానీ ఆ తర్వాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను తెరాస 99 గెలిచి చరిత్రను తిరగరాశామని కేటీఆర్ గుర్తు చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు, శాంతిభద్రతలు, రహదారులు, పెట్టుబడులను ఆకర్షించడం, విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని అందువల్ల ప్రజలకు కేసీఆర్ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుడు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన నేత కాదని కేటీఆర్ అన్నారు.

మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నియోజకవర్గంపై తలసాని ప్రత్యేక దృష్టి పెడతారని ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరని ప్రశంసించారు. డబ్బాలు ఓపెన్ చేసినప్పుడు ఎవరి బాగోతం ఏంటో తెలిసిపోతుందని కేటీఆర్ తెలిపారు.

గత ఎన్నికల్లో చాలామంది తమ ఓట్లు గల్లంతయ్యాయని తన దృష్టికి వచ్చిందని.. చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్లు గల్లంతైన వారు డిసెంబర్ 26 నుంచి జనవరి 26 వరకు తిరిగి తమ ఓట్లను నమోదు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎవరైతే ఎక్కువ ఓట్లు నమోదు చేస్తారో వాళ్లకే ఎక్కువ నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాకూటమి నేతలు మళ్లీ కనిపించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈవీఎం మెషిన్లు కాదు వారి బుర్రలు సరిగా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు.

టీఆర్ఎస్ సంక్షేమ పథకాల వల్ల తెలంగాణలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అందుకే కేసీఆర్‌కు మరోసారి అధికారి అప్పగించారని కేసీఆర్ స్పష్టం చేశారు. 119 సీట్లలో బీజేపీ పోటీ చేసిన 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు చేశామన్నారు.

చంద్రబాబు నాయుడు తిట్లు దీవెనలుగా తీసుకుందామని కేటీఆర్ అన్నారు. గెలుపు నుంచి పాఠాలు, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజలు ఓటు వేసే దిశగా వారిలో అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. టికెట్ల కోసం ఆశించి భంగపడ్డ వారికి నామినేటేడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తానని, ఎవ్వరు నిరాశపడొద్దని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

click me!