సూర్యాపేట: ఎంపిడీవో వేధింపులు... టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

By Arun Kumar PFirst Published Dec 5, 2021, 10:31 AM IST
Highlights

సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృద్ది పనులు చేపడితేే అధికారులు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

సూర్యాపేట: సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృద్ది పనులు చేస్తే బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా సర్పంచ్ భర్తతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... suryapet district చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామ సర్పంచ్‌ గా స్వాతి కొనసాగుతున్నారు. ఆమె TRS Party తరపునే పోటీచేసి సర్పంచ్ గా గెలిచారు. ఇలా అధికార పార్టీ సర్పంచ్ గా కొనసాగుతున్న ఆమెకూ వేధింపులు తప్పలేవు. అప్పులు చేసిమరీ గ్రామంలో అభివృద్ది పనులు చేపడితే బిల్లులు చెల్లించకపోవడమే కాదు ఇతర విషయాల్లోనూ అధికారులు వేధించడంతో తట్టుకోలేకపోయిన సర్పంచ్ స్వాతి భర్తతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది

సర్పంచ్ గా ఎన్నికయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపుమేరకు అప్పులుచేసిమరీ పల్లె ప్రగతి. వైకుంఠధామాల నిర్మాణం వంటివి చేప‌ట్టామని అడ్లూర్ సర్పంచ్ స్వాతి తెలిపారు. అయితే ఈ పనులకు సంబంధించిన రూ.2.50లక్షల బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. 

read more  MLC elections : బెంగళూరులో టీఆర్ఎస్ క్యాంప్.. గుర్రమెక్కిన రసమయి, మాస్క్ ఏదంటూ నెటిజన్ల ఆగ్రహం

ఇది చాలదన్నట్లు నిబంధనల పేరిట స్థానిక ఎంపిడివో వేధింపులకు దిగుతున్నాడని స్వాతి ఆరోపించారు. గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ట్రాలీ ట్యాంకర్‌ కి ఇన్సూరెన్స్‌, రిజిస్ట్రేషన్లు చేయలేదంటూ MPDO గ్యామా నాయక్,  కార్యదర్శి అవినాశ్ మొమోలు జారీ చేసినట్లు సర్పంచ్ స్వాతి పేర్కొన్నారు. 

బిల్లులు చెల్లింపు ఆలస్యం, ఎంపిడివో వేధింపులను తట్టుకోలేక ఎంపిడివో కార్యాలయం ఎదుట సర్పంచ్ స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్తతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. అయితే వెంటనే కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై దంపతులను అడ్డుకున్నారు.  

సర్పంచ్ స్వాతి తనపై చేసిన ఆరోపణలపై ఎంపిడివో స్పందించారు.  ఆమెపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని... మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు మెమోలు జారీ చేశామన్నారు. ఇక అన్ని గ్రామ పంచాయితీల్లో చేపట్టిన పనులకు బిల్లుకు పెండింగ్ లో వున్నాయని... త్వరలోనే చెల్లింపులు చేపడతామని ఎంపిడివో గ్యామానాయక్ స్పష్టం చేసారు. 

ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో వున్నట్లు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలియజేస్తున్నారు. స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన సొంతపార్టీ ప్రజాప్రతినిధులనే బుజ్జగించే పనిలో పడింది టీఆర్ఎస్. స్థానికసంస్థల ప్రజాప్రతినిధులను కుటుంబాలతో సహా విహారయాత్రలకు పంపించడం, ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లకుండా క్యాంపులు నిర్వహించడం వంటివి చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వారు ఎదురుతిరుగుతారో అన్న భయం పట్టుకుందని అర్థమవుతుంది.  

read more  అప్పుల‌ ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతుల ముందంజ‌..వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్రం

ముఖ్యంగా హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా టీఆర్ఎస్ లో పరిస్థితులు మారిపోయాయి. తాజాగా అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి మరీ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సి బరిలోకి దిగాడు. అతడు పోటీలో నిలవడంతో టీఆర్ఎస్ లో గుబులు పట్టుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఓటర్లను టీఆర్ఎస్ క్యాంపుకు తరలించింది.  

మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 6చోట్ల టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచింది. ఇక మిగతాచోట్ల స్వతంత్రులు, కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలవడంతో ఎన్నిక తప్పడంలేదు. అయితే అసంతృప్తితో వున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో  అధికార టీఆర్ఎస్ కు ఎదురుగుతిరిగితారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.


 


 

click me!