ధాన్యం కొనుగోళ్లపై పోరాటానికి టీఆర్ఎస్ రెడీ.. ఈ నెల 6 నుంచి నిరసనలు, 11న ఢిల్లీలో ఆందోళన : కేటీఆర్

Siva Kodati |  
Published : Apr 02, 2022, 05:55 PM ISTUpdated : Apr 02, 2022, 06:00 PM IST
ధాన్యం కొనుగోళ్లపై పోరాటానికి టీఆర్ఎస్ రెడీ.. ఈ నెల 6 నుంచి నిరసనలు, 11న ఢిల్లీలో ఆందోళన : కేటీఆర్

సారాంశం

ధాన్యం  కొనుగోళ్లకు సంబంధించి టీఆర్ఎస్- బీజేపీ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరాటం చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు.   

వరి కొనుగోళ్లపై (paddy procurement) టీఆర్ఎస్ (trs) యాక్షన్  ప్లాన్ చెప్పారు మంత్రి కేటీఆర్ (ktr) . ఎల్లుండి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతామని.. రైతుల్ని అవమానించినందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 6న జాతీయ రహదార్లపై రాస్తారోకో చేస్తామని కేటీఆర్ తెలిపారు. విజయవాడ, ముంబై, బెంగళూరు హైవేలపై రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 7న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రతీ రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టాలని.. ఈ నెల 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరవుతారని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా నిరసన తెలియజేస్తారని చెప్పారు. కేంద్రం వైఖరిని ఢిల్లీలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. 

తెలుగు  ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్. వరి కొనుగోళ్లపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పీయూష్ గోయల్‌ను (piyush goyal) ఎన్నోసార్లు కలిశామని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోళ్లు చేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వరి రైతుల్ని కేంద్రం ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రా రైస్, పారాబాయిల్డ్ రైస్ అంటూ నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రంలో తలా తోకా లేని ప్రభుత్వం వుందని.. కార్పోరేట్లకు వత్తాసు పలుకుతుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులపై ఏమాత్రం ప్రేమలేని ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పిందని కేటీఆర్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తామే చెప్పామని ఆయన పేర్కొన్నారు. యాసంగిలో వడ్డు వేయొద్దని తామే చెప్పామని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ వేసవిలో వరి వేయాలని బండి సంజయ్ చెప్పారంటూ ఆయన ధ్వజమెత్తారు. మీరు వరి వేయండి మేం కొంటామని బండి సంజయ్ చెప్పారని మంత్రి దుయ్యబట్టారు. 

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పిస్తామని బండి సంజయ్ మాట్లాడారని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని చెప్పారని మంత్రి వెల్లడించారు. బాయిల్డ్ రైస్, రా రైస్ కూడా కేంద్రమే కొంటుందని కిషన్ రెడ్డి చెప్పారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవద్దని రైతులకు బండి సంజయ్ చెప్పారంటూ దుయ్యబట్టారు. ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ మాట్లాడుతోన్న సిల్లీ  బీజేపీ కరెక్టా అని కేటీఆర్ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర రైతుల్ని బీజేపీ అయోమయానికి గురిచేస్తోందని ముందు నుంచీ చెబుతున్నామని.. కేటీఆర్ అన్నారు. వీళ్లు కొనరు.. కొనరు అని మొత్తుకున్నామన్నారు. 

రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రమంత్రి చెప్పారని.. కిషన్ రెడ్డి ఓ పనికిమాలిన మంత్రి అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఓ దౌర్భాగ్యుడని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మానసిక స్థితిపై మాకు అనుమానాలున్నాయని కేటీఆర్ అన్నారు. వన్ నేషన్- వన్ ప్రొక్యూర్‌మెంట్  కావాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. యాసంగి వడ్లు కొంటారో లేదో స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యాసంగి వడ్లు కొంటామని బీజేపీ నేతలు చెప్పారని.. మిమ్మల్ని నమ్మి యాసంగి వరి వేశారని కేంద్రం కొనితీరాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. వరి కొనాలని ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని.. కేంద్రం తీరు దున్నపోతు మీద వానపడ్డట్టుగా వుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!