800 ఏళ్ల నాటి వృక్షానికి సెలైన్ బాటిల్స్‌తో చికిత్స.. పిల్లలమర్రికి పూర్వ వైభవం

By Siva KodatiFirst Published Sep 12, 2022, 10:04 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన 800 ఏళ్ల నాటి పిల్లలమర్రి పూర్వ వైభవంతో కళకళలాడుతోంది. గత ఏడాది పచ్చదనం పెంచేందుకు సీడ్ బాల్స్ ద్వారా జిల్లా యంత్రాంగం కృషి చేసిందని తద్వారా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా సాధించామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు
 

చెదలు పట్టి కూలిపోయే దశకు చేరుకున్న ఆసియాలోనే రెండో అతిపెద్ద పిల్లలమర్రిని సంరక్షించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తెలంగాణ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ . చెట్టుకే సెలైన్ బాటిళ్ల ద్వారా చికిత్స అందించి కాపాడుకోవడం వల్ల తిరిగి పిల్లలమర్రికి పూర్వ వైభవం రావడం గొప్ప విషయమని మంత్రి ప్రశంసించారు. మహబూబ్‌నగర్ పిల్లలమర్రి చౌరస్తాలో రూ. 30 లక్షలతో తీర్చిదిద్దిన జంక్షన్‌‌ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా పిల్లలమర్రిని సంరక్షించేందుకు తీసుకున్న చర్యలపై ఎంపీకి మంత్రి వివరించారు. 

 

 

అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం మొదలు పెట్టిన తర్వాతే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలుగా  కురుస్తున్నాయన్నారు. గత ఏడాది పచ్చదనం పెంచేందుకు సీడ్ బాల్స్ ద్వారా జిల్లా యంత్రాంగం కృషి చేసిందని తద్వారా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా సాధించామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణకు హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని స్వయం సహాయక బృందాలు 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్‌ను త‌యారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాయని మంత్రి గుర్తుచేశారు. ఈసారి ఆ రికార్డును అధిగమించబోతున్నామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పిల్లలమర్రిని ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. పిల్లలమర్రి సంరక్షణ కోసం ఎంపీ నిధుల నుంచి రూ. 2 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

 

 

ఒక ప్రయోగశాలగా మార్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని దేశమంతా గుర్తిస్తోందని మంత్రి తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని... కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా కూడా అమలవుతాయని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ విజన్ ఒక తెలంగాణకే కాకుండా దేశమంతటికి అవసరమని దేశవ్యాప్తంగా ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ సంకల్పం, ఆలోచన చాలా గొప్పదన్న ఆయన... గొప్ప సంకల్పం ఉన్న వాళ్లను ఎవరు ఆపలేరని వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా వుంటాయన్నారు. 

 

 

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని సంరక్షించేందుకు తన నిధుల నుంచి రూ.2  కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇంతటి పురాతన చరిత్ర ఉన్న వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లలమర్రిని సొంత పిల్లల్లా చూసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని ఆయన అభినందించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలమర్రి సంరక్షణకు నడుంబిగించడం అభినందనీయమన్నారు. చారిత్రాత్మక పిల్లలమర్రిని సంరక్షించేందుకు సెలైన్ బాటిల్స్‌తో ట్రీట్మెంట్ చేయడం ఎంతో గొప్ప విషయమని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి వేరును కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ... తిరిగి ప్రాణం పోశారని ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు ఎండిపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి మహావృక్షం నేడు పచ్చగా కళకళలాడుతుండటం సంతోషంగా వుందన్నారు. 

click me!