
విభజన హామీల అమలు విషయంలో కేంద్రం ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ఎంపీలు స్పీడు పెంచారు. ఈ క్రమంలో మంగళవారం కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్‌తో పాటు ఎన్‌హెచ్ఏఐ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ఎంపీలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు...అలాగే ఈ ప్రాజెక్ట్ విషయంలో సాయం చేయాల్సిందిగా వారు గడ్కరికీ విజ్ఞప్తి చేశారు. గతంలో పీఎం మోడీతో కేసీఆర్ సమావేశం సందర్భంగా ఆర్ధిక సాయంపై నీతి అయోగ్ సూచనలను కేసీఆర్ ప్రధాని మోడీకి వివరించారు.
ఇదే అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నితిన్ గడ్కరీకి వివరించారు. అలాగే సీతారామ ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని వారు కోరారు. దీనిపై స్పందించిన గడ్కరీ ఈ నెల 21న ప్రత్యేకంగా రీజనల్ రింగ్ రోడ్‌పై చర్చిద్దామని హామీ ఇచ్చారు.
అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. డీఆర్ఆర్‌తో పాటు రీజనల్ రింగ్ రోడ్డు అవశ్యకతను ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఈ నెల 21న నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హైకోర్టు విభజన మరింత ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రవిశంకర్ ప్రసాద్ ఇక మీదట హైకోర్టు విభజనలో ఎలాంటి ఆలస్యం ఉండదని స్పష్టం చేశారు.
ఇవాళ కూడా టీఆర్ఎస్ ఎంపీలు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. మంత్రులను కలిసిన వారిలో వినోద్, జితేందర్ రెడ్డి, కవిత, నగేశ్, లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.