నేను ఎప్పుడూ కేసీఆర్ సేవలోనే.. అదే నా జీవితంలో ఏకైక పని: ఎంపీ సంతోష్ కుమార్

By Sumanth KanukulaFirst Published Sep 29, 2022, 9:48 AM IST
Highlights

టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి  సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ మందలించారని.. దీంతో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ వార్తలను సంతోష్ కుమార్ ఖండించారు. 

టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి  సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ మందలించారని.. దీంతో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో ‘గులాబీ కోట కుప్పకూలడం మొదలైంది’ అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. అయితే ఆ వార్తలను సంతోష్ తీవ్రంగా ఖండించారు. అసలేం జరిగిందంటే.. కేసీఆర్‌కు భార్య తరఫు బంధువు అయిన సంతోష్.. ఆయన వ్యక్తిగత వ్యవహారాలతో పాటు, పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని.. దీంతో సంతోష్ కలత చెంది ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని దక్కన్ క్రానికల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ నేపథ్యంలోనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని సంతోష్ కుమార్ ఖండించారు. ఈ మేరకు దక్కన్ క్రానికల్‌కు వివరణ ఇచ్చారు. తన నాయకుడు, జీవితానికి ఏకైక స్పూర్తి వద్దనే తాను ఎల్లప్పుడూ ఉంటానని స్పష్టం చేశారు. తాను మనిషిని కాదా?, తనకు మనసు లేదా? అని ప్రశ్నించారు. తనకు బ్యాడ్ మూమెంట్, ఆరోగ్య సమస్య ఉండదా అని తనపై వచ్చిన వార్తను ఖండించారు. 

కేసిఆర్‌ బృహత్కార్యానికి తాను సేవకుడిని మాత్రమేనని సంతోష్ చెప్పారు. ఈ విషయంలో తన నమ్మకాన్ని ఈ భూమ్మీద ఏ శక్తి కూడా మార్చలేదని స్పష్టం చేశారు. తాను కొద్దిపాటి పార్టీ బాధ్యతల నుంచి వైదొలగడంలో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. తనను తాను నాయకుడిని అనుకోనని చెప్పారు. తాను కేసీఆర్‌కు సేవల చేయడానికే పనిచేస్తున్నాని.. ఆయన లేకుంటే తాను నంథింగ్ అని చెప్పారు.  ఆయన ఆజ్ఞలన్నింటినీ వినయంగా పాటించడమే నా జీవితంలో ఏకైక పని అని పేర్కొన్నారు. ఆయన సేవలో తప్ప తాను ఎక్కడైనా ఉంటాననే మాట హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మరోవైపు పార్టీ శ్రేణులకు కూడా తాను ఎక్కడకి వెళ్లలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పారు. కేసీఆర్ సేవలోనే ఉన్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ప్రగతిభవన్‌లోనే ఉన్నానని.. తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల రాజకీయ ఆకాంక్షలు.. ప్రజలను వ్యక్తిగతంగా కిందకి లాగేలా రాజకీయాలు దిగజారకూడదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: ఎంపీ సంతోష్ కుమార్ హర్ట్ అయ్యారా?.. ఫోన్ స్విచ్ఛాఫ్‌తో టీఆర్ఎస్‌ వర్గాల్లో కలవరం..!

అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణల విషయంపైనా, దాని వెనుక రాజకీయాలపైనా మాత్రం సంతోష్ కుమార్ స్పందించలేదు.  “ఏం జరుగుతుందో అదే జరుగుతుంది” అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. 

click me!