నిన్ను చెప్పులతో కొడుతాం, రూ. 25 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నావు: రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి

By telugu teamFirst Published Jul 3, 2021, 4:56 PM IST
Highlights

తెలంగాణ పీసీీస అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. రేవంత్ రెడ్డిని చెప్పులతో కొడుతామని సుధీర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: కాంగ్రెసు టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితురులు శనివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమను చెప్పులతో కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని, రేవంత్ రెడ్డిని చెప్పులతో కొడుతామని సుధీర్ రెడ్డి అన్నారు. 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, తమపై మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని ఆయన అన్నారు. దొంగరాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి మాట్లాడే అర్హతను కోల్పోయారని ఆయన అన్నారు రాజస్థాన్ లో కాంగ్రెసు బిఎస్పీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. 

టికెట్లనే కాకుండా పీసీసీ పదవులను కూడా అమ్ముకునే సంస్కృతి కాంగ్రెసులో ఉందని, 2018లో స్వయంగా తన టికెట్ అమ్ముకున్నారని, తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీకి రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి తెచ్చుకన్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి మాట్లాడితే తాము రెండు మాట్లాడుతామని ఆయన హెచ్చరించారు. సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి తాము సరైన భాషా ప్రయోగం చేస్తున్నామని ఆయన అన్నారు. 

రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు చెందిన ఎంపీలు బిజెపిలో చేరలేదా, అప్పుడెందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. తాము ఎవరికీ ద్రోహం చేయలేదని, ఎవరినీ వెన్నుపోటు పొడవ లేదని వార్న్నారు. చట్టప్రకారమే తాము టీఆర్ఎస్ లో విలీనమయ్యామని ఆయన చెప్పారు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఆ రాష్ట్రాల్లో కూడా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెసు ఎప్పటికీ అధికారంలోకి రాదని, కాంగ్రెసు సిద్ధాంతాలూ వైఖరీ ప్రజలకు దూరమయ్యాయని ఆయన అన్నారు. మాటల గారడీలు చేస్తే రేవంత్ రెడ్డి జోకరులా మిగిలిపోతారని సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెసులో రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలో చేరగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, ఆ తర్వాత కొడంగల్ టికెట్, ఆ వెంటనే ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు. డబ్బులతో రేవంత్ రెడ్డి వ్యవహారాలు నడిపిస్తున్నారని, అది ఎల్లకాలం పనిచేయదని ఆయన అన్నారు  పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెసులో ఉంటున్నారని, లేకుంటే ఉండేవారు కాదని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలనే వివాదాస్పదమని మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఏ ఎంపీ అని, రేవంత్ రెడ్డి వాడిన భాష నిషేధత జాబితాలోకి వస్తుందని, మావోయిస్టులు అటువంటి భాష మాట్లాడుతారు కాబట్టే నిషేధానికి గురయ్యారని అంటూ ఇప్పుడు కాంగ్రెసు పార్టీని నిషేధించాలా అని అడిగారు. 

తమ వెసులుబాటు ప్రకారమే టీఆర్ఎస్ తో కలిశామని ఆయన అన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెసు చేస్తే సంసారం, తాము చేస్తే వ్యభిచారమా అని ఆయన అడిగారు. ఇప్పటికీ చంద్రబాబే రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎంపీలు బిజెపిలో ఎలా వెళ్లారని ఆయన అడిగారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని శాసనసభకు పంపిస్తే రాజీనామా చంద్రబాబుకు ఇచ్చారని అంటూ రాజీనామా ఎవరికి ఇస్తే ఆమోదం పొందుతుందో రేవంత్ రెడ్డికి తెలియదా అని అడిగారు. ఉత్తుత్తి రాజీనామా ఇచ్చి శాసనసభ రద్దయ్యే వరకు శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి కొనసాగారని ఆయన విమర్శించారు 

రేవంత్ రెడ్డి అవసరాలకు పార్టీ మారుతారని, షార్ట్ కట్ పద్ధతిలో వచ్చి టాప్ లో ఉండాలని అనుకుంటారని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. తాము టీఆర్ఎస్ లో విలీనమైన అంశం కోర్టులో ఉందని చెబుతూ కోర్టు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కాంగ్రెసు ఉండేవాడివా అని గండ్ర వెంకటరమణా రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.  పైలట్ రోహిత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

click me!