వైఎస్ షర్మిల భర్త అనిల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ

By telugu teamFirst Published Aug 9, 2021, 10:45 AM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. దీనిపై టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమావేశమయ్యారు. ఆదివారంనాడు వారిద్దరి భేటీ జరిగినట్లు చెబుతున్నారు. వారిద్దరు హైదరాబాదులోని లోటస్ పాండులో కాకుండా వేరే ప్రాంతంలో సమావేశమైనట్లు చెబుతున్నారు. 

తాటికొండ రాజయ్య కొద్ది రోజులుగా బ్రదర్ అనిల్ తో తరుచుగా సమావేశమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి భేటీ గురించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు గుసగుసగా చెబుకుంటున్నాయి. ఈ భేటీ మతపరమైందా, రాజకీయపరమైందా అనే విషయంపై స్పష్టత లేదు. 

ఈ భేటీపై టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజయ్యపై టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే విషయం తెలియడం లేదు. కాగా, గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి తొలిగించారు. దాంతో ఆయన అప్పటి నుంచి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రెండోసారి రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ రాదని భావించారు. కానీ కేసీఆర్ ఆయననే పోటీకి దించారు. రెండోసారి గెలిచిన తర్వాత కూడా టీఆర్ఎస్ లో రాజయ్య స్థాయి మారలేదు. దానికితోడు వరంగల్ జిల్లాలోని సీనియర్ నేత కడియం శ్రీహరితో ఆయనకు ఏ మాత్రం పొసగడం లేదు. 

click me!