సంస్కారహీనంగా వైఎస్ షర్మిల మాట్లాడే భాషకు భవిష్యత్తులో ఏం జరిగినా తాము బాధ్యత వహించబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని ఆయన చెప్పారు.
హైదరాబాద్:వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు భవిష్యత్తులో ఏం జరిగినా తాము బాధ్యులం కామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారంనాడు హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సంస్కార హీనంగా హద్దుమీరి షర్మిల మాట్లాడితే ఏం జరిగినా దానికి తాము బాధ్యత వహించబోమని ఆయన తేల్చి చెప్పారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు. అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందుకు కారణం కానుందని బాల్క సుమన్ తెలిపారు. తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియనట్టుందన్నారు.
also read:తెలంగాణానా ఆఫ్ఘనిస్తానా, కేసీఆర్ ఓ తాలిబన్: మద్దతిచ్చినవారికి షర్మిల ధన్యవాదాలు
సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు.ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడితే ఎలా అని సుమన్ అడిగారు.పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో తిరుగుతూ తమనే దూషిస్తున్నారన్నారు. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. పరాయి మనుషులు కిరాయి మనుషులతో తెలంగాణలో చేస్తున్న తోలుబొమ్మలాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవససరం లేదని బాల్క సుమన్ చెప్పారు. షర్మిల ఎవరు, ఆమె వెనుక ఉన్న వారెవరో తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుమన్ కోరారు.అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలన్నారు. టీఆర్ఎస్ ను చీల్చేందుకు వైఎస్ఆర్ ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అందుకే మహబూబాబాద్ లో గతంలో నీ సోదరుడు యాత్ర చేస్తామంటే తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారన్నారు.
వైఎస్ఆర్ కుటుంబం తెలంగాకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ లో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్రదర్శించిన ప్లకార్డుల వీడియోను ఆయన మీడియా సమావేశంలో చూపారు. అంతేకాదు తెలంగాణకు వ్యతిరేకంగా గతంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను సుమన్ ప్రస్తావించారు.తెలంగాణకు వ్యతిరేకంగా షర్మిల పలుమార్లు వ్యాఖ్యలు చేశారన్నారు. ఏపీ నుండి వచ్చిన మహిళ షర్మిల అంటూ ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కు ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డును ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు.
ఉమ్మడి ఏపీలోని నంద్యాలలో హైద్రాబాద్ కు రావాలంటే వీసా తీసుకోవాలని వైఎస్ఆర్ చేసిన ప్రసంగాన్ని బాల్క సుమన్ ప్రస్తావించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని షర్మిల బయ్యారం గనులను దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములను ఆక్రమించుకున్నారన్నారు.వైఎస్ఆర్ కుటుంబం అంటే తెలంగాణ ప్రజలకు కోపం ఉందన్నారు.
తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా ఉన్న షర్మిల తెలంగాణకు వచ్చి సుద్దులు చెబితే ఎవరైనా నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ షర్మిల మాట్లాడుతున్న భాషను బాల్క సుమన్ తీవ్రంగా తప్పుబట్టారు. షర్మిల మాట్లాడే భాష ఆడపిల్ల మాట్లాడే భాషేనా అని ఆయన ప్రశ్నించారు. షర్మిల ఆడపిల్ల మాదిరిగా మాట్లాడుతుందా అని ఆయన అడిగారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అసభ్యకరంగా వ్యాఖ్యానించారన్నారు. తన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర సమయంలో ఇష్టారీతిలో మాట్లాడారన్నారు. ఈ సమయంలో తాను తమ పార్టీ శ్రేణులను నిలువరించినట్టుగా బాల్క సుమన్ తెలిపారు.