అది పదవి పరిరక్షణ దీక్ష: భట్టిపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 13, 2019, 6:17 PM IST
Highlights

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. ప్రజాస్వామ్యం గురించి భట్టి విక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. ప్రజాస్వామ్యం గురించి భట్టి విక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని.. దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఆ పార్టీ నేతల నోటి వెంట ప్రజాస్వామ్యం అనే పదం రావడం విడ్డూరంగా ఉందని సుమన్ ఎద్దేవా చేశారు.

ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందని.. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూడాలేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆధిపత్య పోరులో భాగంగానే భట్టి దీక్ష చేశారని... కాంగ్రెస్ నుంచి ఎవరో.. ఎటో పోతారని వార్తలు వస్తున్నాయని...  ముందు భట్టి ఆ సంగతిపై దృష్టి పెట్టాలని బాల్కసుమన్ సూచించారు.

మండల, జడ్పీటీసీ  ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన తీర్పునిచ్చారని.. అయినా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చివరికి టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్సే గెలిచిందని సుమన్ గుర్తు చేశారు.

తమను కొనుగోలు చేయడానికి తాము బర్రెలం, గొర్రెలం కాదని ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా సుమన్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ... భట్టి చేసింది ప్రజా స్వామ్య పరిరక్షణ దీక్ష కాదని.. పదవి పరిరక్షణ దీక్ష అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగానే టీఆర్ఎస్‌లో విలీనమయ్యారని గట్టు తెలిపారు. రాజ్యాంగం పదో షెడ్యూల్‌లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని.. వీటిపై భట్టి కేసీఆర్‌తో చర్చించేదేమి ఉంటుందని ఆయన ప్రశ్నించారు.  

ఫిరాయింపుదారుడైన రేవంత్‌ను పక్కనబెట్టుకుని భట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా అని దుయ్యబట్టారు. విక్రమార్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిందని.. ఆయనకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని రామచంద్రరావు సవాల్ విసిరారు. 

click me!