మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకునేలా టీఆర్ఎస్ భారీ స్కెచ్.. ఆ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్న గులాబీ నేతలు..

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 11:20 AM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీజేపీలకు ధీటుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. 

మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, 2018లో మాత్రం అక్కడ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

అయితే మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీజేపీలకు ధీటుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే మునుగోడు ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.  నియోజకవర్గంలో వారం రోజుల పాటు ‘సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమం’ చేపట్టింది. తద్వరా ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. 

టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ప్రారంభించిన సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రతి మండలంలో ప్రజలతో కలిసి భోజనం చేసి వారి బాధలను తెలుసుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. పట్టణాలు, గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు. ప్రజలు ఫిర్యాదు చేసే సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ సామూహిక భోజన కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగనుంది. 

తొలుత సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి.. చౌటుప్పల్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి వేలాది మందిని భోజనానికి ఆహ్వానించారు. సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాల ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘‘ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలనేది పార్టీ ఆలోచన. ఇందులో ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడమే కాకుండా.. వారి ఫిర్యాదులను వినడం, వారి గ్రామాలు, పట్టణాలలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించడం జరుగుతుంది. ఏవైనా లోటుపాట్లు ఉంటే గుర్తించడం జరగుతాయి. వాటిని పరిష్కరించడానికి మార్గాన్ని అన్వేషించడం కూడా జరుగుతుంది’’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 21న చండూరు మండలంలో, 22న నారాయణపూర్ మండలంలో, 23న మర్రిగూడ మండలంలో, 24న మునుగోడు మండలంలో, 26న నాంపల్లి మండలంలో నిర్వహించారు. సెప్టెంబర్ 25 బతుకమ్మ ఉత్సవాల కారణంగా ఈ   సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాకి గ్యాప్ ఇచ్చారు. 

click me!