కళ్యాణ లక్ష్మిని మరింత సులభతరం చేసిన కేసీఆర్

By telugu news teamFirst Published Nov 20, 2020, 3:44 PM IST
Highlights

లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడేవారు.. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేసేవారు. 
 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరింత సులభతరం చేశారు. నిరుపేద కుటుంబాలకు ఈ పథకం చాలా ఆసరాగా నిలుస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మొదట్లో రూ. 51, 000 అందించేవారు. తర్వాత రూ.75,116లకు పెంచారు. అనంతరం 2018లో రూ.1,00116లకు పెంచారు.

కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పెళ్లి తర్వాత చాలా డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. అంతేకాకుండా వచ్చే నగదు కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడేవారు.. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న మధ్యవర్తులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వారిని మోసం చేసేవారు. 

వీటన్నిటికీ పుల్‌స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం పథకానికి సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించింది. ప్రభుత్వ అధికారుల ద్వారా వాటిని అమలు చేస్తోంది.. తాజాగా పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి సాయం పొందవచ్చని తొర్రూరు తహసీల్దార్ రాఘవరెడ్డి తెలిపారు. లగ్నపత్రిక రాయించుకున్న రోజునే వధువు కుటుంబ సభ్యులు కల్యాణలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవచ్చన్నారు. 

కులం, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలుమీ సేవలో సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సరిగ్గా పెళ్లి ముహూర్తానికల్లా రూ.1,00116 ఆర్థికసాయం పొందవచ్చని తెలిపారు. దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని అన్నారు. డబ్బులు నేరుగా వధువు తల్లి ఖాతాలో జమవుతాయని వివరించారు. అర్హులైన నిరుపేద యువతులందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు.

click me!