
మునుగోడు:టీఆర్ఎస్ నుండి వేనేపల్లి వెంకటేశ్వరరావును బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడ రద్దు చేసినట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మునుగోడు నియోజకవర్గానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బదులుగా మరోకరిని అభ్యర్ధిగా బరిలోకి దింపాలని కూడ పార్టీ నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అయితే టీఆర్ఎస్ నేత వేనేపల్లి వెంకటేశ్వరర్ రావు చండూరు కేంద్రంగా అసమ్మతి నేతల మద్దతుతో సభను ఏర్పాటు చేశారు.
మునుగోడు అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మార్చాలని ఈ సభ ద్వారా పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఈ సభతో పాటు నియోజకవర్గానికి చెందిన కీలకమైన కొందరు నేతలు కూడ పార్టీ ముఖ్య నాయకులకు అభ్యర్థిని మార్చాలని కూడ కోరారు.
అయితే వేనేపల్లి వెంకటేశ్వరరావు చేస్తున్న కార్యక్రమాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.దీంతో వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు టీఆర్ఎస్ బుధవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా కొన్ని స్థానాల్లో అసంతృప్తులు బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసంతృప్తులను బుజ్జగించేందుకు స్థానిక నేతలతో పాటు పార్టీ నాయకత్వం కూడ చర్యలు తీసుకొంటుంది. అయితే పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా కార్యక్రమాలను చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్ సంకేతాలను ఇచ్చింది.
పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వేనేపల్లి వెంకటేశ్వర్ రావును టీఆర్ఎస్ నుండి బహిష్కరించడం ద్వారా అసంతృప్తులకు కేసీఆర్ షాకిచ్చారు.