Telangana News: కౌన్సిలర్ రవి దారుణ హత్య... ఎమ్మెల్యే శంకర్ నాయక్ పనే..: మృతుడి తల్లి, భార్య

Arun Kumar P   | Asianet News
Published : Apr 22, 2022, 03:43 PM IST
Telangana News: కౌన్సిలర్ రవి దారుణ హత్య... ఎమ్మెల్యే శంకర్ నాయక్ పనే..: మృతుడి తల్లి, భార్య

సారాంశం

మహబూబాబాద్ టీఆర్ఎస్ కౌన్సిలర్ రవినాయక్ హత్య వెనక స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తముందని ప్రచారం జరుగుతోంది. మృతుడి కుటుంబసభ్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్‌: అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పట్టపగలే నడిరోడ్డుపై కొందరు దుండగులు గొడ్డలితో నరికిచంపిన దారుణం మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకే చెందిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ హత్య చేయించినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇలా సొంత పార్టీ కౌన్సిలర్ నే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అతి కిరాతకంగా చంపించడం దారుణమని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కౌన్సిలర్ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలో 8వ వార్డు కౌన్సిలర్ గా బానోతు రవినాయక్ కౌన్సిలర్ గా కొనసాగుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన రవి ప్రధాన పార్టీలను ఓడించి మరీ గెలుపొందాడు. తన వార్డు అభివృద్ది కోసం అతడు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 

అయితే ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజి మంజూరవగా దాని నిర్మాణ స్థలం విషయంలో రవి నాయక్ అధికార పార్టీలో విబేధించాడు. మెడికల్ కాలేజ్ కోసం కొందరు గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే తమకు ఇష్టంలేకపోయినా బలవంతంగా భూములు లాక్కున్నారని బాధిత గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా రవి నాయక్ పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టాడు. 

ఇలా ప్రజలపక్షాన నిలబడి తనకు వ్యతిరేకించడం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు నచ్చకే సొంత పార్టీ కౌన్సిలర్ అనికూడా చూడకుండా హత్యచేయించాడని రవినాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపిస్తున్నారు. రవినాయక్ రాజకీయ ఎదుగులను చూసి ఓర్వలేకే హత్యచేసారని... ఈ హత్య వెనక ఖచ్చితంగా ఎమ్మెల్యే హస్తముందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  

కౌన్సిలర్ రవినాయక్ మృతదేహాన్ని చూడటానికి వెళ్ళిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులను కుటుంసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. అయితే శంకర్ నాయక్ మాత్రం రవి హత్యతో తనకెలాంటి సంబంధం లేదని... నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మృతుడి కుటుంబానికి అన్నిరకాలుగా అండగా వుండి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు.

ఇక మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత కూడా రవినాయక్ మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబంతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ కూడా హాస్పిటల్ కు చేరుకుని రవినాయక్ మృతదేహాన్ని చూసి కుటుంబాన్ని ఓదార్చారు.

రవినాయక్ హత్య ఎలా జరిగిందంటే..

మహబూబాబాద్ పట్టణ 8వ వార్డ్ కౌన్సిలర్ రవినాయక్ పత్తిపాకలో నూతనంగా ఇళ్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంటిపనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి బైక్ పై తిరిగి వెళుతున్న అతడిపై కొందరు దుండగులు దాడిచేసారు. ముందుగానే రవి రాకకోసం కాపుకాసిన దుండగులు ఒక్కసారిగా అతడిని అడ్డుకుని గొడ్డలతో దాడికి దిగారు. విచక్షణారహితంగా నరికడంతో అతడు రక్తపుమడుగులో పడిపోయాడు. తీవ్ర గాయాలపై కుప్పకూలినా  అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాతే దుండగులు సంఘటనా  స్థలంనుండి వెళ్లిపోయారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య పట్టణంలో కలకలం రేపింది.   

 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్