ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ....

By narsimha lodeFirst Published Sep 2, 2020, 3:24 PM IST
Highlights

వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్లాన్ చేస్తోంది.

2016లో తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు.

2018 లో రెండోసారి టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు ఏకపక్ష తీర్పును ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో కూడ ఇదే రకమైన తీర్పు రావాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

తమ ప్రభుత్వ పాలనలో జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రానున్న ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. నియోజకవర్గాల వారీగా హైద్రాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

బుధవారం నాడు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు... ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

త్వరలోనే టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. 

మరో వైపు వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. హైద్రాబాద్ పరిధిలో పలు జిల్లాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడ బాధ్యతలను అప్పగిస్తారు. 

మరో వైపు ఇప్పటికే వార్డుల వారీగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కమ్యూనిటీ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచారాన్ని ప్రారంభించాయి. మరో వైపు ఏ వార్డులో ఏ అభ్యర్ధిని బరిలో నిలిపితే విజయావకాశాలు ఉంటాయనే విషయమై కూడ గులాబీ నాయకత్వం ఆరా తీస్తోంది.
 

click me!