పదేళ్లుగా నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్: విచారణలో వెలుగుచూసిన దారుణాలు

By Nagaraju penumalaFirst Published Sep 30, 2019, 3:32 PM IST
Highlights

నిలోఫర్‌ ఆస్పత్రిలో గత పదేళ్లుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్లు నివేదికలో తేలింది. ఈ పదేళ్లలో 13 ట్రయల్స్‌ జరగ్గా ఆ చిన్నారుల పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్ అంశంపై విచారణను వేగవంతం చేసింది ప్రభుత్వం. క్లీనికల్ ట్రయల్స్ వివాదం పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది.

ఈ ముగ్గురు సభ్యుల బృందం నీలోఫర్ ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. సోమవారం నీలోఫర్‌ బోర్డు రూమ్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు పిడియాట్రిక్స్ హెడ్ రవికుమార్‌ను విచారించింది. వీరితోపాటు ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ రాజారావు, లక్ష్మీకామేశ్వరి, విమల థామస్‌లను సైతం కమిటీ విచారించింది. 

నిలోఫర్‌ ఆస్పత్రిలో తమ పిల్లలపై క్లీనకల్ ట్రయల్స్ జరిగాయని వందలాది మంది చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రిలో క్యూ కడుతున్నారు. గత ఏడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. 

ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపై ఈ క్లీనికల్ ట్రయల్స్ జరిగినట్లు క్లీనికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. 300 మందిలో 100 మందిని జనరల్‌ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి ఎంపిక చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. 

చిన్నారులపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగినట్లు నివేదికలో తేటతెల్లమైంది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించినట్లు తెలిసింది. ఇన్ పేషెంట్లుగా ఉన్న చిన్నారులపై ఆ ఔషధాలు పనిచేస్తుందో అనే అంశాలపై వివరాలు సేకరించారు. 

ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు, కంపెనీ ప్రతినిధులు, ఇతర సహాయకులు ఒక్కటై ఈ క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు నివేదిక స్పష్టం చేసింది.  

నిలోఫర్‌ ఆస్పత్రిలో గత పదేళ్లుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్లు నివేదికలో తేలింది. ఈ పదేళ్లలో 13 ట్రయల్స్‌ జరగ్గా ఆ చిన్నారుల పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. విచారణలో వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్: పంపకాల తేడాతో బట్టబయలైన ప్రొఫెసర్ల దందా

click me!