
మహబూబాబాద్ జిల్లాలో తండా వాసులు రెచ్చిపోయారు. ఏకంగా తహసీల్దార్‌పై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రానికి సమీపంలోని సాలార్ తండా సమీపంలో 551 సర్వే నెంబర్‌లో కోర్టు భవన నిర్మాణం కోసం భూ సర్వే చేయడానికి తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే వీరిని గిరిజన యువత, మహిళలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా.. ఈ క్రమంలోనే ఘర్షణకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే కొంతరు గిరిజన రైతులు తహసీల్దార్, ఇతర సిబ్బందిపై దాడికి దిగారు. అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను తోటి సిబ్బంది మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.