
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఈ రోజు సాయంత్రం నిర్వహించే మోదీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసన తర్వాత ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. మోదీతో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ కోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీగా జనసమీకరణ కూడా చేపట్టింది. ఇప్పటికే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
బీజేపీ బహిరంగ సభ, జాతీయ కార్యవర్గ సమావేశాలకు పలువురు నగరానికి విచ్చేసిన నేపథ్యంలో.. పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బహిరంగ సభకు విచ్చేసే వారిని ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించినట్టుగా పోలీసులు చెప్పారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
ట్రాఫిక్ ఆంక్షలు, సూచనలు..
- హెచ్‌ఐసీసీ మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, టివోలి, ప్లాజా క్రాస్‌రోడ్‌ల చుట్టూ ఉన్న రహదారుల్లో ఆంక్షలు విధించనున్నారు.
-టివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేయబడుతుంది. సికింద్రాబాద్ పరిధిలోని పలు జంక్షన్లలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఉండవచ్చు.
- ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్‌డీ రోడ్లలో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి 3 కి.మీ పరిధిలోని అన్ని జంక్షన్లు/ రోడ్లో ప్రయాణాలను నివారించాలని ప్రజలకు సూచించారు.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లు ప్రయాణికులు..
1. పంజాగుట్టు వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్‌టీసీ క్రాస్ రోడ్ మీదుగా చిలకగూడ నుంచి ఫ్లాట్ ఫామ్ 10 ద్వారా వెళ్లాలి.
2. ఉప్పల్ వైపు నుంచి నారాయణ గూడ, ఆర్‌టీసీ క్రాస్ రోడ్ మీదుగా చిలకలగూడ నుంచి ఫ్లాట్ ఫామ్ 10 ద్వారా వెళ్లాలి.
3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లు వారు ప్యాట్నీ, పారడైస్, బేగంపేట్ మార్గాల్లో వెళ్లకూడదు.
-కరీంనగర్, నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు జౌటర్ రింగ్ రోడ్డు నుంచి వేరే మార్గాల ద్వారా నగరంలోకి ప్రవేశించాలి.
-ఉప్పల్ వైపు నుంచి పంజాగుట్ట, అమీర్‌పేట్ వైపు వచ్చే వాహనాలు తార్నాక, రైలు నిలయం రోడ్డును నివారించి... ఆర్టీసీ క్రాస్ రోడ్డు, లక్డికాపుల్ మీదుగా వెళ్లాలి.
-మేడ్చల్, బాలానగర్, ఖార్ఖనా, తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లు ప్రయాణికులు నేరెడిమేట్, మల్కాజ్ గిరి వైపు నుంచి వెళ్లాలి.
ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు అందరూ పైన సూచించిన విధంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అత్యవసర సమయంలో ప్రయాణ సమాచారం, సలహాల కొరకు 040- 2785 2482 నెంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. ఇక, ఈ రోజు ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో సభలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ రాజ్‌భవన్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ మార్గాన్ని రేపు ఉదయం వరకు మూసివేయనున్నారు.