కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్.. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ నేత జీ నిరంజన్

By telugu teamFirst Published Aug 28, 2021, 7:17 PM IST
Highlights

కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఈ విషయం కేటీఆర్‌కు తెలుసా అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ అన్నారు. కేసీఆర్‌ది తిన్నింటి వాసాలే లెక్కపెట్టే నైజమని విమర్శించారు. కేటీఆర్‌కు చరిత్ర తెలియదని, ఆయన బేషరతుగా కాంగ్రెస్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ది తిన్నింటి వాసాలు లెక్కించే నైజం అని అన్నారు. కేటీఆర్ అధికార మదంతో ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. వెంటనే ఆయన కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 136 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు బినామీలు, తొత్తులతో పార్టీని నడిపించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు చరిత్రపై అవగాహన లేదని, అసలు కేసీఆర్, చంద్రబాబు నాయుడుకు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రజా బలమున్న పార్టీ, అన్ని కులాలు, మతాలను సమానంగా ఆదరిస్తూ దేశ సమైక్యత, సమగ్రతలే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని నిరంజన్ వివరించారు. వి హనుమంతరావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు ఆయనతోపాటు ఉపాధ్యక్షులుగా ఉన్న విషయం కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. 1983లో తప్పుడు పాస్‌పోర్టుల ఆరోపణల కారణంగా అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గులాం నబీ ఆజాద్ కేసీఆర్‌ను పదవి నుంచి తొలగించారని, ఆ ఉత్తర్వులు ఒక రోజు మొత్తం ప్రెస్‌కు రిలీజ్ చేయకుండా వి హెచ్‌ను బ్రతిమిలాడుకుని రాజీనామా చేసినట్టు నటించి అప్పుడే ఏర్పడ్డ టీడీపీలో చేరారని వివరించారు. 

తన గురువైన మదన్ మోహన్‌కే కేసీఆర్ పంగనామాలు పెట్టారని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దేవత అని చెప్పి, తర్వాత మోసం చేసింది కేసీఆర్ కాదా? ఆయనది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం అని విమర్శలు గుమ్మరించారు. తెలంగాణలో కేసీఆర్‌కు బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

click me!