టీ కాంగ్రెస్‌లో రేవంత్ టూర్ టెన్షన్.. ఏం జరుగుతుందోనని శ్రేణుల ఆందోళన..

Published : Apr 29, 2022, 10:23 AM IST
టీ కాంగ్రెస్‌లో రేవంత్ టూర్ టెన్షన్.. ఏం జరుగుతుందోనని శ్రేణుల ఆందోళన..

సారాంశం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు టీ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు టీ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వాహించాలని టీపీసీసీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే కరీంనగర్, ఖమ్మంలో సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. అయితే నల్గొండలో మాత్రం రేవంత్ సన్నాహాక సమావేశంపై ఆ జిల్లాకు చెందిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అభ్యంతరం తెలిపారు. 

దీంతో మాజీ జానారెడ్డి జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌లో సన్నాహాక సమావేశం నిర్వాహించేలా ఖరారు చేశారు. ఈ క్రమంలోనే నేడు నాగార్జున సాగర్‌‌లో నిర్వహించనున్న సన్నాహాక సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే రేవంత్ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు హాజరు అవుతారా..?, లేదా..? అనే ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటికే రేవంత్ ఉమ్మడి జిల్లా పర్యటనను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో కాంగ్రెస్ బలంగానే ఉందని.. ఇక్కడికి బయటివారు రావాల్సిన అవసరం లేదని సష్పం చేశారు. రేవంత్ నిర్వహించే సమావేశానికి తాను హాజరు కావడం లేదని.. తన సొంత నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు. ఇక, మాజీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేతల తీరుపై రేవంత్ వర్గం మండిపడుతుంది. 

మరోవైపు నల్గొండ డీసీసీ రేవంత్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులందరికీ ఆహ్వానం పంపినట్టుగా డీసీసీ తెలిపింది. రేవంత్ నిర్వహించే సన్నాహాక సమావేశానికి కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయితే రేవంత్ సమావేశానికి కీలక నేతలు ఎవరు హాజరు అవుతారు..?, సభ సజావుగా సాగుతుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఉమ్మడి జిల్లా నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

పైకి ఎన్ని మాటలు చెబుతున్న కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుందని.. నేతల మధ్య ఐక్యత లేదని స్పష్టం అవుతుంది. రేవంత్‌ను ఇప్పటికి కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అనుమతి ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు లేఖ రాయనున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరింత చర్చనీయాంశంగా మారింది. 

రాహుల్‌తో టీ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం తర్వాత.. కొద్ది రోజులు అంతా సర్దుకుందని భావించని శ్రేణులు సంబరపడ్డారు. అయితే ఈలోపే మరోసారి అంతర్గత విభేదాలు బయటపడంతో.. ఇక వీటికి ముగింపు ఉండదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముందుకు నడిపించాల్సిన నాయకులే ఇలా వ్యవహరించడం పార్టీ శ్రేణులను అసంతృప్తికి గురిచేస్తుంది. పార్టీలో రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గంగా నేతలు ఉన్నారనే మాట వినిపిస్తుంది. సన్నాహాక సమావేశాల సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాహుల్ గాందీ సభ నాటికి ఇది ఏ విధంగా మారుతుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. నేతల్లో ఐక్యత ఏ మేరకు ఉంటుందో రాహుల్ సభ తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్