పాలమూరు నుంచే గద్దె దించుతా: కేసీఆర్‌కు రేవంత్ వార్నింగ్

By Siva KodatiFirst Published Oct 2, 2021, 6:45 PM IST
Highlights

తనను ఇంట్లో నిర్బంధించినా తాము మౌనంగానే వున్నామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని వెనుక మహాత్మా గాంధీ స్పూర్తి వుందన్నారు . పాలమూరు జిల్లా నుంచే కేసీఆర్‌ను గద్దె దించే పనిని చేపడతామని రేవంత్ హెచ్చరించారు. 
 

తనను ఇంట్లో నిర్బంధించినా తాము మౌనంగానే వున్నామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని వెనుక మహాత్మా గాంధీ స్పూర్తి వుందన్నారు . పాలమూరు జిల్లా నుంచే కేసీఆర్‌ను గద్దె దించే పనిని చేపడతామని రేవంత్ హెచ్చరించారు. 

అంతకుముందు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశాయి. గాంధీ జయంతి రోజున తన ఇంటి వద్ద ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని రేవంత్‌ ప్రశ్నించారు. ఒకవేళ గృహనిర్బంధం చేస్తే ఆర్డర్‌ కాపీ చూపించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? అని రేవంత్ ప్రశ్నించారు.  

ఒక ఎంపీకి నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా? గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని... తనపై గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలని ఆయన డిమాండ్ చేశారు.  శ్రీకాంతాచారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలి? నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలా అని రేవంత్ మండిపడ్డారు. శ్రీకాంతాచారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు కోపమెందుకు అని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్‌ తప్ప శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా? నన్ను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే నేను వెనుదిరుగుతానని రేవంత్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద దుకాణాలను పోలీసులు మూసివేయించారు.  

click me!