తెలంగాణలోనూ ‘‘గ్యారెంటీ’’ కార్డ్ వ్యూహం.. రేవంత్ క్లారిటీ, మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం

By Siva KodatiFirst Published Jun 9, 2023, 6:44 PM IST
Highlights

కర్ణాటకలో అనుసరించిన గ్యారెంటీ స్కీమ్‌ల వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు 
 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి సెంట్రల్ జైలులో డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని క్షత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తండ్రీ కొడుకులు నిప్పు తొక్కిన కోతిలా ఎగుతురున్నారని దుయ్యబట్టారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో కాంగ్రెస్ కట్టించే డబుల్ బెడ్ రూమ్‌లో కొడుకు , కోడలు, బిడ్డ, అల్లుడు వుండొచ్చన్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం బ్యాచ్ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలా తాము దోపిడీ చేయమని.. అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్  నిర్మాణాల్లో జరిగిన అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ రద్దయిన 500 నోటైతే, మోడీ 2000 నోటని.. 5 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళతామని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని.. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. గడీల పాలన కోసం, వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ ఆరోపించారు. ధరణి ద్వారా హైదరాబాద్ నగరం చుట్టూ వున్న భూములను దోచుకున్నారని.. వాటిని బీనామీలపై వుంచారని ఆయన పేర్కొన్నారు. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకు బాధ కలుగుతోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ALso Read: మూడు రోజుల్లో ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

రాష్ట్రంలో కాంగ్రెస్ లేదన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు తిడుతున్నారని ఆయన నిలదీశారు. ధరణి రద్దు అయితే రైతు బంధు రాదని తండ్రీకొడుకులిద్దరూ అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అన్న రేవంత్.. వన్ నేషన్, వన్ పార్టీ అన్నదే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో నీళ్లు , నిధులు, నియామకాలు అన్న స్లోగన్.. ఇప్పుడు లీకులు, లిఫ్టులు, లిక్కర్‌గా మారిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 

మరోవైపు కాంగ్రెస్ పదేళ్ల పాలన, బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలన్న మంత్రి కేటీఆర్ సవాల్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వీకరించారు. అధికార పార్టీ నుంచి ఎవరొస్తారని ఆయన ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని రేవంత్ కోరారు. 
 

click me!