కాంగ్రెస్‌ను జాకీ పెట్టి లేపినా లేవదు: ఖమ్మంలో బండి సంజయ్ సెటైర్లు

By narsimha lode  |  First Published Jun 9, 2023, 5:36 PM IST

వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో  బీఆర్ఎస్ పాలన  అంతం కానుందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.  ఇవాళ ఖమ్మంలో బండి సంజయ్  బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.


ఖమ్మం:  ఐదు నెలల్లో తెలంగాణలో  కుటుంబ పాలన పోతుందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విశ్వాసం  వ్యక్తం  చేశారు. శుక్రవారంనాడు  ఖమ్మంలో  బీజేపీ  కార్యకర్తల సమావేశంలో ఆయన  ప్రసంగించారు.  ఈ నెల  15న  ఖమ్మంలో  జరిగే అమిత్ షా  సభ విజయవంతం  చేసేందుకు  బండి సంజయ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఖమ్మం ఎవరికీ అడ్డా కాదన్నారు. బీజేపీకే అడ్డా అని  ఆయన  చెప్పారు.  

ఖమ్మంలో బీజేపీ లేదని అవమానిస్తున్నారన్నారు. ఖమ్మంలో బీజేపీ  బలం చూపాలని ఆయన  పార్టీ కార్యకర్తలను కోరారు.  తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని  బలోపేతం  చేసేందుకు  కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని  ఆయన   విమర్శించారు. జాకీలు పెట్టి  కాంగ్రెస్ ను లేపేందుకు  ప్రయత్నిస్తున్నా కూడా కాంగ్రెస్ లేవడం లేదని ఆయన  ఎద్దేవా  చేశారు.  కర్ణాటకలో  కాంగ్రెస్ విజయం సాధించినా గాంధీ భవన్ తప్ప  విజయోత్సవాలు  నిర్వహించుకోలేని  స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. 

Latest Videos

దేశంలో కాంగ్రెస్, కమ్యూనిష్టులు లేరన్నారు.  అమిత్ షాతోనే కాదు, మోడీతో కూడ సభ పెడతామని బండి సంజయ్ చెప్పారు.సర్వేల్లో బీజేపీ ఓటేస్తామని జనం చెబుతున్నారన్నారు.ఈ సర్వే రిపోర్టుతో  కేసీఆర్ కు భయం మొదలైందని బండి సంజయ్ చెప్పారు. 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  తెలంగాణపై  బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. తెలంగాణలో  అధికారం కైవసం  చేసుకొనే దిశగా  వ్యూహాలు  రచిస్తుంది. ఈ క్రమంలోనే  9 ఏళ్ల మోడీ పాలనలో  తెలంగాణలో  చేసిన  సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను  బీజేపీ శ్రేణులు వివరిస్తున్నారు.ఈ క్రమంలోనే  బీజేపీ అగ్రనేతలతో  భారీ బహిరంగ సభలను  ఆ పార్టీ ఏర్పాటు  చేస్తుంది.  ఇందులో భాగంగానే  కేంద్ర మంత్రి అమిత్ షా సభ  ఈ నెల  15న ఖమ్మంలో  బీజేపీ  ఏర్పాటు  చేసింది. 


 

click me!